“ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేసి చంపాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేసి చంపుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో వృద్ధురాలిపై దాడి చేస్తున్న వ్యక్తి ముస్లిం కాదు. అలాగే, ఆ వృద్ధురాలు కూడా చనిపోలేదు. ఈ సంఘటన 23 ఫిబ్రవరి 2025న ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషున్‌పురా ప్రథమ్ ప్రాంతంలో జరిగింది. భూ వివాదం కారణంగా ఈ సంఘటన జరిగిందని, ఈ ఘటనలో వృద్ధురాలి పై దాడి చేసిన వ్యక్తి పేరు ఆశిష్ పాండే అని పోలీసులు పేర్కొన్నారు. అలాగే FIRలో ఈ ఘటనలో నిందితులు ఆశిష్ పాండే, మనీష్ పాండేగా పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 23 ఫిబ్రవరి 2025న ‘ఫ్రీ ప్రెస్ జర్నల్ (Free Press Journal)’ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ సంఘటన 23 ఫిబ్రవరి 2025న ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషున్‌పురా ప్రథమ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో బాధితులను రామజ్ఞాని, అతని భార్య నిమితా దేవిగా గుర్తించారని, రామజ్ఞాని తన పొరుగువారితో ఆస్తి/భూ వివాదం కలిగి ఉన్నాడని, ఈ ఘటనలో వృద్ధ దంపతులపై దాడి చేసిన వ్యక్తి ఆశిష్ పాండేగా గుర్తించారని, ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆశిష్ పాండే, మరొక వ్యక్తిపై పోలీసులు నమోదు చేశారని, అలాగే, పోలీసులు పాండేను అరెస్టు చేశారని, ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని ఈ కథనం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

ఈ సమాచారం ఆధారంగా మేము ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి గౌరీబజార్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. FIR ప్రకారం, ఆశిష్ పాండే అనే వ్యక్తి మనీష్ పాండేతో కలిసి, 2025 ఫిబ్రవరి 23న గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషున్‌పురా ప్రథమ్ ప్రాంతంలో రామజ్ఞాని, అతని భార్య నిమితా దేవిపై భూ వివాదం కారణంగా దాడి చేశాడు. అలాగే FIRలో ఈ ఘటనలో నిందితులు ఆశిష్ పాండే, మనీష్ పాండేగా పేర్కొన్నారు. ఈ ఘటనలో నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

తదుపరి ఈ సంఘటన సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మేము గౌరీబజార్ పోలీస్ స్టేషన్‌ని కూడా సంప్రదించాము. మాతో మాట్లాడుతూ, గౌరీబజార్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని స్పష్టంచేశారు. అలాగే ఈ వీడియోలో వృద్ధ మహిళపై దాడి చేస్తూ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆశిష్ పాండే అని పేర్కొన్నారు. అలాగే అతని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.
చివరగా, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియోను మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.