శబరిమలలో బాల అయ్యప్ప భక్తుడితో కేరళ పోలీసులు దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. బాలుడు పోలీస్ అధికారికి చేతులతో మొక్కుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియోలోని బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శబరిమలలో ఓ చిన్నారి అయ్యప్ప భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫాక్ట్ (నిజం): శబరిమలలోని నిలక్కల్ ప్రాంతంలో ఓ బాలుడు కనపడకుండాపోయిన తన తండ్రిని వెతికి తీసుకురావాలని పోలీస్ అధికారిని వేడుకుంటున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పూర్తి వీడియోలో ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడి తండ్రి బస్సు దగ్గరికి వచ్చి అతన్ని కలిసాడు. కేరళ రోడ్డు రవాణా సంస్థ (KSRTC) లోగో బస్సుపై ఉండటాన్ని బట్టి, బాలుడు కూర్చున్నది కేరళ ప్రభుత్వ బస్సులో అని, పోలీసు వ్యాన్‌లో కాదని స్పష్టమయ్యింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇదే వీడియోని ‘Asianet Newsable’ వార్తా సంస్థ 12 డిసెంబర్ 2023 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. శబరిమలలో కనపడకుండాపోయిన తన తండ్రిని వెతికి తీసుకురావాలని ఓ బాలుడు ఏడుస్తూ ప్రాధేయపడుతున్న దృశ్యాలంటూ ఈ ట్వీట్లో తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘Asianet’ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. శబరిమలలోని నిలక్కల్ ప్రాంతంలో ఓ బాల అయ్యప్ప భక్తుడు తన తండ్రి కనిపించకపోవడంతో పోలీస్ అధికారితో తన తండ్రిని వెతికితీసుకురావాలని ఏడుస్తూ వేడుకున్నాడని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. ‘Asianet’ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసిన పూర్తి వీడియోలో, బాలుడి తండ్రి వెంటనే బస్సు దగ్గరికి వచ్చి బాలుడిని కలిసినట్టు చూపిస్తుంది.
ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, “వైరల్ వీడియోలోని బాలుడిని వెంటనే తన తండ్రి దగ్గరికి చేర్చాము. కొందరు ఉద్దేశపూర్వకంగానే క్లిప్ చేసిన వీడియోని షేర్ చేస్తూ నిజాన్ని దాస్తున్నారు”, అని తెలిపారు.
పూర్తి వీడియోలో బాలుడు KL-15 A-814 నంబర్ ప్లేట్‌తో ఉన్న కేరళ రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో కూర్చున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. బస్సుపై KSRTC లోగో ఉండటాన్ని బట్టి, బాలుడు కూర్చున్నది కేరళ ప్రభుత్వ బస్సులో అని, కొన్ని పోస్టులలో తెలుపుతున్నట్టు పోలీసు వ్యాన్‌లో కాదని స్పష్టంగా తెలుస్తుంది.
చివరగా, శబరిమలలో ఓ బాలుడు కనపడకుండాపోయిన తన తండ్రిని వెతికి తీసుకొని రావాలని పోలీస్ అధికారిని వేడుకుంటున్న వీడియోని తప్పుడు నేపథ్యంతో షేర్ చేస్తున్నారు.