Fake News, Telugu
 

2011లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన వీడియోని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

నైరుతి ఋతుపవనాల రాకతో దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. “హై అలర్ట్.. తస్మత్  జాగ్రత్త # తెలుగు రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు #ఈ వర్షం ఏంట్రా బాబు” అని చెప్తూ నీటిలో ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోతున్న వీడియో ప్రచారం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలో ఐదుగురు గల్లంతు అయిన వీడియో.

ఫాక్ట్ (నిజం): తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి నిజమే, వరదలలో కొందరు గల్లంతు అయిన వార్తలు కూడా నిజమే. కానీ, పోస్టులో ఉన్న వీడియో 2011లో మధ్య ప్రదేశ్ లోని “ పాతాళ్ పాని ” జలపాతం వద్ద ఐదుగురు గల్లంతైన ఘటనకి సంబంధించినది. కావున, ఈ పోస్టులో షేర్ చేస్తున్న తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న వీడియోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, 21 జులై 2011న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన పూర్తి వీడియో లభించింది. ఇందులో 0:41 నుంచి 1:11 వరకు ఉన్న క్లిప్ వైరల్ అవుతున్న పోస్టులో ఉంది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ కథానాల ప్రకారం, 17 జులై 2011 లో మధ్య ప్రదేశ్ లోని “ పాతాళ్ పాని ” అనే జలపాతం వద్ద సందర్శకులు ఉన్న సమయంలో,  ఒక్కసారిగా ఎగువ నుంచి వరద నీరు వచ్చింది. ప్రవాహ వేగానికి ఐదుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వారిలో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జలపాతం ఉన్న ప్రదేశం చుట్టూ గోడను ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల వల్ల వరదల కారణంగా కొంత మంది ప్రజలు గల్లంతు అయిన వార్తలు వచ్చాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2011లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన వీడియోని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll