ఇటీవల చైనాలో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం పొంగి పొర్లుతుందంటూ, పడవలు, ఇతర వాహనాలు కొట్టుకపోతున్న ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం పొంగి పొర్లడంతో పక్కన ఉన్న పడవలు, వాహనాలు ఆ నీటిలో కొట్టుకపోతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నవి 2011లో జపాన్‌లోని మియాకో నగరంలో సంభవించిన సునామీకి సంబంధించిన దృశ్యాలు. ఈ వీడియోకి చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాంకి ఎటువంటి సంబంధంలేదు. పైగా ఈ మధ్య కాలంలో చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం పొంగి పొర్లుతున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో 2011లో జపాన్‌లోని మియాకో నగరంలో సంభవించిన సునామీకి సంబంధించిన వీడియో. పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ విజువల్స్‌ని పోలిన ఫోటోలను ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. నేషనల్ జియోగ్రాఫిక్ కథనం ప్రకారం 2011లో మియాకోలోని సముద్ర తీరంలో సంభవించిన సునామీకి తీరాన ఉన్న పడవలు, ఇతర వాహనాలు, కొన్ని ఇళ్ళు కొట్టుకు పోయాయి. పోస్టులోని వీడియో ఈ ఘటనకి సంబంధించిందే. CNN న్యూస్ వీడియో కూడా 2011 జపాన్ సునామీ గురించి ప్రసారం చేసిన కథనంలో ఇవే ఫోటోలను ప్రచురించింది. జపాన్‌లో 2011 లో సంభవించిన సునామీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.
ఒక జపనీస్ న్యూస్ వీడియో కూడా ఈ దృశ్యాలను 2011లో సంభవించిన సునామీ దంటూ ప్రసారం చేసింది. యూట్యూబ్ లో ఇదే వీడియోని ‘Tsunami, Great East Japan Earthquake – Miyako city, Iwate Pref, Japan [11 Mar 2011]’ అనే టైటిల్ తో అప్లోడ్ ఆ వార్తా సంస్థ అప్లోడ్ చేసింది. జపాన్ లో సునామీ సంభవించి 4 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఒక తమిళ్ న్యూస్ ఛానల్ 2015లో ప్రసారం చేసిన ఒక కథనంలో కూడా ఇదే వీడియోని ప్రసారం చేసింది.
పైగా ఈ మధ్య కాలంలో చైనాలోని త్రీ గోర్జెస్ డ్యాం పొంగి పొర్లుతున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. వీటన్నిటిబట్టి, పోస్టులోని వీడియోకి చైనాకి ఎటువంటి సంబంధంలేదని, ఈ వీడియో 2011లో మియాకో నగరంలో సంభవించిన సునామీకి సంబంధించిందని స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, 2011 జపాన్ సునామీ వీడియోని చైనాలోని డ్యాం పొంగి పొర్లుతున్నట్టు షేర్ చేస్తున్నారు.