Fake News, Telugu
 

తైవాన్‌కి సంబందించిన వీడియోని యూరో 2020 కప్ గెలిచిన ఆనందంలో ఇటలీ అభిమానులు చేసుకుంటున్న వేడుకలని షేర్ చేస్తున్నారు

0

యూరో 2020 ఫుట్‌బాల్ కప్ గెలిచిన ఆనందంలో ఇటలీ అభిమానులు బాణసంచా కాలుస్తూ తమ దేశంలో వేడుకలు చేసుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: యూరో 2020 ఫుట్‌బాల్ కప్ గెలిచిన తరువాత ఇటలీ అభిమానులు వేడుకలు చేసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు తైవాన్ ప్రజలు ప్రతి సంవత్సరం జరుపుకునే ‘బైషాతున్ మజు’ తీర్థయాత్ర వేడుకలకు సంబంధించింది. ‘బైషాతున్ మజు’ వేడుకలలో భాగంగా ‘మత్సు’ సముద్ర దేవత విగ్రహాన్ని బైషాతున్ నగరంలోని గాంగ్ టియన్ దేవాలయం నుంచి యున్లిన్ ప్రాంతంలోని చావోటియన్ దేవాలయం వరకు పల్లకిలో ఉరేగిస్తూ తీసుకెళ్ళి, మళ్ళీ గాంగ్ టియన్ దేవాలయానికి తీసుకువస్తారు. ఈ తీర్థయాత్రలో పాల్గొన్న తైవాన్ భక్తులు, ‘మత్సు’ దేవత పల్లకి వెళ్ళే దారుల్లో బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఈ వీడియోకి ఇటలీ ఫుట్‌బాల్ అభిమానులు యూరో 2020 కప్ గెలిచినందుకు చేసుకున్న సంబరాలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కొందరు యూట్యూబ్ యూసర్లు ఏప్రిల్ 2021లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ యూట్యూబ్ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు తైవాన్ ప్రజలు ప్రతి సంవత్సరం జరుపుకునే ‘బైషాతున్ మజు’ తీర్థయాత్ర వేడుకలకు సంబంధించినవని ఈ పోస్టులలో తెలిపారు. ఆ వీడియోకి సంబంధించిన అధికారిక వివరాల కోసం గూగుల్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని చైనా దేశానికి చెందిన ‘SCTN’ న్యూస్ ఛానల్ 16 ఏప్రిల్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘బైషాతున్ మజు’ తీర్థయాత్ర వేడుకల సందర్భంగా 500 మీటర్ల పొడువుగా పేర్చిన బాణసంచాని భక్తులు కాలుస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. 

‘బైషాతున్ మజు’ తీర్థయాత్ర వేడుకకి సంబంధించిన వివరాలు తెలుపుతూ ‘Taipei Times’ న్యూస్ వెబ్సైటు ఒక ఆర్టికల్‌ని పబ్లిష్ చేసింది. ‘బైషాతున్ మజు’ వేడుకలలో భాగంగా ‘మత్సు’ సముద్ర దేవత విగ్రహాన్ని బైషాతున్ నగరంలోని గాంగ్ టియన్ దేవాలయం నుంచి యున్లిన్ కౌంటీలోని చావోటియన్ దేవాలయం వరకు పల్లకిలో ఉరేగిస్తూ తీసుకెళ్ళి, మళ్ళీ గాంగ్ టియన్ దేవాలయానికి తీసుకువస్తారని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ తీర్థయాత్ర వేడుకలని గాంగ్ టియన్ దేవాలయ యాజమాన్యం నిర్వహిస్తుందని ఇందులో తెలిపారు. ‘మత్సు’ దేవత పల్లకి వెళ్ళే దారులలో భక్తులు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారని ‘Taiwan Today’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. 

‘బైషాతున్ మజు’ వేడుకలలో తైవాన్ ప్రజలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న మరికొన్ని వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, వీడియోలో కనిపిస్తున్న కొందరు వ్యక్తుల టీ-షర్టుల పై చైనీస్ భాషలో రాసి ఉన్న అక్షరాలు ఉండటాన్ని మనం చూడవచ్చు.

11 జూలై 2021 నాడు ఇటలీ-ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగిన యూరో 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ, ఇంగ్లాండ్‌పై విజయం సాధించి యూరో 2020 కప్పుని కైవసం చేసుకుంది. ఇటలీ యూరో 2020 కప్ గెలవడంతో ఆ దేశ ఫుట్‌బాల్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. 12 జూలై 2021 నాడు యూరో 2020 కప్‌తో ఇటలీ చేరుకున్న తమ ఫుట్‌బాల్ జట్టు సభ్యులని ఇటలీ ప్రజలు ఘనంగా స్వాగతించారు. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటలీ ఫుట్‌బాల్ అభిమానులు వేడుకలకి సంబంధించింది కాదు.

చివరగా, తైవాన్ ‘భైశాటున్ మాజు’ వేడుకలకి సంబంధించిన వీడియోని యూరో 2020 కప్ గెలిచిన తరువాత ఇటలీ అభిమానులు వేడుకలు చేసుకుంటున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll