Fact Check, Fake News, Telugu
 

రుణాలు, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా FRBM పరిమితులను పాటించట్లేదు

0

కేంద్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి అప్పులు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు పరిమితులు దాటాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వాదనలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వ అప్పులు పరిమితులకు లోబడి ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు పరిమితులు దాటాయి.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పేర్కొన్న భారత దేశం చెల్లించాల్సిన అప్పుల వివరాలు కరెక్ట్ కాదు. మోదీ మొదటి సారి ప్రధాని అయ్యే సమయానికి (31 మార్చ్ 2014 నాటికి) కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పు సుమారు 56 లక్షల కోట్లు కాగా, 2021కి (31 మార్చ్ 2021) వచ్చేసరికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పు సుమారు 121 లక్షల కోట్లకు చేరుకుంది. అప్పులు, ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా FRBM నిర్దేశించిన పరిమితులను ఉల్లంగిస్తునే ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మార్చ్ 2014 నాటికి భారత దేశం ఎక్స్టర్నల్ (ఇతర దేశాల నుండి, అంతర్జాతీయ సంస్థల వద్ద నుండి) అప్పుల విలువ 440.6 బిలియన్ డాలర్లు కాగా, జూన్ 2020 నాటికి అది 554.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐతే దేశ ఎక్స్టర్నల్ అప్పుల వివరాలను మొత్తం భారత్ దేశం అప్పు అని తప్పుగా అర్ధం చేసుకున్నారు. కాని నిజానికి 31 మార్చ్ 2014 నాటికి మొత్తం భారత దేశ అప్పు సుమారు 56 లక్షల కోట్లుగా, అది 31 మార్చ్ 2021 నాటికి సుమారు 121 లక్షల కోట్లకు చేరుకుంది. పోస్టులో తెలిపిన భారత దేశ అప్పుల వివరాలు తప్పు. ఐతే కేవలం ఈ అప్పుల నికర  విలువను పరిగణలోకి తీసుకొని ఇప్పటి ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై విమర్శ చేయలేము, ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసిన అప్పుకి సంబంధించి వడ్డీ లేదా అసలు చెల్లిస్తూ ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు, ప్రస్తుత ప్రభుత్వాలు అభివృద్ధి పై ఖర్చు చేయడానికి మళ్ళీ తిరిగి అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి GDPలో అప్పుల యొక్క నిష్పత్తిని (debt-to-GDP ratios) పరిగణలోకి తీసుకుంటే మనకు అప్పులకు సంబంధించి ప్రభుత్వ విధానాలపై సరైన అవగాహన వచ్చే అవకాశం ఉంది.

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ (FRBM):

సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రభుత్వ రాబడికి, వ్యయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ రాబడి కన్నా వ్యయం అధికంగా ఉంటుంది. ఇలా రాబడితో పోలిస్తే బడ్జెట్ వ్యయం మించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు)గా పరిగణిస్తారు. ప్రభుత్వాలు ఈ లోటుని అప్పుల ద్వారా పూడుస్తాయి. ఐతే ప్రతీ సంవత్సరం ఈ ఫిస్కల్ డెఫిసిట్‌ని భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తుండడంతో ప్రభుత్వాలు చెల్లించాల్సిన అప్పులు పెరిగి ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయి (ప్రభుత్వాలకు వచ్చే రాబడిలో ఎక్కువ శాతం అభివృద్ధిపై కాకుండా ఈ అప్పులకు అయ్యే వడ్డీలకు ఖర్చు చేయాల్సి వస్తుంది).

ఐతే ప్రభుత్వాలు ఇలా ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా, ఆర్ధిక వ్యవస్థ నియంత్రణలో ఉంచేందుకు 2003లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆక్ట్, 2003’ (FRBM)ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా  కేంద్ర, రాష్ట్రాల GDPలో (స్థూల జాతీయోత్పత్తి) ఫిస్కల్ డెఫిసిట్ శాతం, GDPలో అప్పుల శాతం మొదలైన అంశాలలో పరిమితులు విధించారు. ఐతే 2017లో ఈ చట్టాన్ని పునఃసమీక్షించడానికి ఒక కమిటీని వేయగా, ఆ కమిటీ ఆర్థిక నిబంధనలకు సంబంధించి కొన్ని సవరణలు చేసి అవలంభించాల్సిన ఆర్ధిక పరిమితులను నిర్దేశించాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ కమిటీ ప్రతిపాదనలను పాటిస్తుంది. ఈ కమిటీ ప్రతిపాదించిన పరిమితులలో కొన్ని కింద చూడొచ్చు.

  • కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జీడీపీలో ఫిస్కల్ డెఫిసిట్ శాతాన్ని 0.3% తగ్గించుకుంటూ 2023 మార్చి 31 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటును) జీడీపీలో 2.5% వరకు పరిమితం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ రుణాలు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు) జీడీపీలో 60% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి.
  • 2024-25 చివరికల్లా కేంద్ర ప్రభుత్వ రుణాలు GDPలో 40% మించకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు GDPలో 20% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి.
  • ప్రతీ సంవత్సరం రెవెన్యూ (ఆదాయ) లోటును GDPలో కనీసం 0.5% తగ్గించుకుంటూ మార్చి 31, 2023 నాటికి రెవెన్యూ లోటును GDPలో 0.8 శాతానికి తగ్గించాలి.

ఐతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పడు ఈ పరిమితిని సవరిస్తూ  ఫిస్కల్ డెఫిసిట్ పరిమితులకు మించి అప్పులు చేస్తున్నాయి. ఇందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి ద్రవ్య నియంత్రణ చట్టాన్ని తెచ్చినప్పటి (2003) నుండి ఇప్పటివరకు GDPలో అప్పుల యొక్క నిష్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ, 2018లో నిర్దేశించిన లక్ష్యాలను మాత్రం ఇంకా చేరుకోలేదు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి:

2013-14లో GDPలో 67.06% గా ఉన్న భారత దేశ అప్పు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని) 2019-20 చివరికల్లా 69.62%కి చేరుకుంది. దీన్నిబట్టి, GDPలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రుణాలు యొక్క నిష్పత్తిని 60% మించకుండా చూడాలని 2018 FRBM రూల్స్‌లో పేర్కొన్న లక్ష్యాలను చేరుకోలేదని అర్ధమవుతుంది.

కేవలం కేంద్ర ప్రభుత్వ రుణాలను పరిగణలోకి తీసుకుంటే, మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పటి నుండి చూస్తే GDPలో కేంద్ర ప్రభుత్వ రుణాలు యొక్క నిష్పత్తి ప్రతీ సంవత్సరం స్వల్పంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ 2018లో నిర్దేశించిన FRBM లక్ష్యాలను మాత్రం ఇంకా చేరుకోలేదు. 2013-14లో GDPలో 52.16%గా ఉన్న కేంద్ర అప్పు, 2019-20 చివరికల్లా 48.60% కి చేరుకుంది.

అదేవిధంగా 2013-14లో GDPలో 4.48%గా ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ (స్థూల) ప్రతీ సంవత్సరం స్వల్పంగా తగ్గుతూ 2020-21 చివరికల్లా 3.54కి చేరుకున్నప్పటికీ 2015లో గాని లేక 2018లో గాని నిర్దేశించుకున్న లక్ష్యాలను (ప్రతీ సంవత్సరం GDPలో ఫిస్కల్ డెఫిసిట్‌ని కనీసం 0.3% తగ్గించాలి) అమలు కావట్లేదు. దీన్నిబట్టి కూడా కేంద్ర ప్రభుత్వం FRBM పరిమితులను పాటించట్లేదని, ఆ లక్ష్యాలకు దూరంగా ఉందని స్పష్టమవుతుంది.

సాధారణంగా ప్రభుత్వాలు చేసే ఖర్చులను రెవెన్యూ ఎక్స్‌పెన్‌డీచర్ (జీతాలు చెల్లించడం, పెన్షన్స్ చెల్లించడం, అప్పులకు వడ్డీలు చెల్లించడం మొదలైన ఖర్చులు) మరియు కాపిటల్ ఎక్స్‌పెన్‌డీచర్ (అభివృద్ధి కార్యక్రమాలకు, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన అంశాలపై జరిపే ఖర్చులు). ఐతే పోస్టులో చెప్తున్నట్టు ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను మౌలిక వసతులు కల్పించడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఖర్చు చేయడం సరైన వాదన అయినప్పటికీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం చేసే టోటల్ ఎక్స్‌పెన్‌డీచర్లో కాపిటల్ ఎక్స్‌పెన్‌డీచర్ వాటా 15% లోపే ఉంటుంది.

అదేవిధంగా పోస్టులో ప్రస్తావించినట్టు 2014తో పోల్చుకుంటే మన విదేశీ మరకద్రవ్యాలు పెరిగినప్పటికీ, చాలా వరకు మన దేశ అప్పులు అంతర్గతంగా (ఇంటర్నల్‌గా) తీసుకున్నవి. వీటిని తీర్చడానికి విదేశీ మరకద్రవ్యాలను వాడరు. విదేశీ మరకద్రవ్యాలనేవీ ఎక్స్‌టర్నల్‌గా (ఇతర దేశాల నుండి, అంతర్జాతీయ సంస్థల వద్ద నుండి) తెచ్చిన అప్పులను తీర్చడానికి, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువలో హెచ్చు తగ్గులను అదుపులో ఉంచుకోవడానికి, ముడి చమురు కొనడానికి, మొదలైన సందర్భాల్లో వాడతారు. అంతేగాని డాలర్లను అమ్మి వాటితో అంతర్గతంగా చేసిన అప్పులను తీర్చరు.

రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి:

అలాగే రాష్ట్రాల విషయానికి వస్తే 2013-14లో GSDPలో 22%గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, 2019-20 చివరికల్లా 24.25%కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర GSDPలో అప్పుల శాతం FRBM పరిమితుల కన్నా ఎక్కువగా ఉంటూ వస్తుంది. 2020లో సవరించిన బడ్జెట్ లెక్కల ప్రకారం రాష్ట్ర GSDPలో అప్పుల వాటా 31.8%. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాలు GSDPలో అప్పుల వాటా విషయంలో  FRBM పరిమితులను దాటేస్తున్నాయి. ఇటీవల కాలంలో పెద్ద రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే కేవలం కర్ణాటక, మహారాష్ట్ర మాత్రమే GSDPలో అప్పుల వాటాని FRBM నిర్దేశించిన పరిమితుల లోపు ఉంచుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్రాలు కూడా FRBM నిర్దేశించిన పరిమితులను పాటించట్లేదని అర్ధమవుతుంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటును) భర్తీ చేయడానికి చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులను దాటి అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుని సంప్రదించి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న FRBM నిబంధనల ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) భర్తీ కోసం GSDPలో 3% వరకే రాష్ట్రాలు అప్పు తీసుకోవడానికి వీలవుతుంది. ఐతే ఇటీవల కరోనా వల్ల అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం పడి రాష్ట్రాల ఆదాయాలు తగ్గడంతో ఈ 3% నిబంధనని 5%కి పెంచాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులతో ఫిస్కల్ డెఫిసిట్ భర్తీ కోసం GSDPలో 5% వరకు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతినిచ్చింది.

పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల సంస్కరణలను, విద్యుత్ సంస్కరణలు, వ్యాపారం సులభతరం చేయడానికి సంబంధించిన సంస్కరణలు, ఆదార్‌ని రేషన్ కార్డుతో లింక్ చేయడం వంటి కొన్ని షరతులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పలు షరతులను అమలుచేసి అధిక రుణాలు పొందాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల సంస్కరణలు అమలు చేసి అధిక రుణాలు పొందాయి. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ సడలింపులకు సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఏ ఇతర రాష్ట్రాలైన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులకు లోబడే రుణాలు తీసుకుంటాయి, ఈ పరిమితులు కాదని రుణాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు.

చివరగా, రుణాలు మరియు ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా FRBM పరిమితులను పాటించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll