Fake News, Telugu
 

2010 కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించిన వీడియోని లండన్ లోని స్కూల్ అసెంబ్లీ ప్రార్థన పాట అంటూ షేర్ చేస్తున్నారు

0

కొందరు స్కూల్ విద్యార్థులు సంస్కృత శ్లోకాలు చదువుతున్న వీడియోని షేర్ చేస్తూ, ఈ వీడియో వెస్ట్ లండన్ లోని సెయింట్ జేమ్స్ స్కూల్ లో ఉదయం జరిగే అసెంబ్లీదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వెస్ట్ లండన్ లోని సెయింట్ జేమ్స్ స్కూల్ లో ఉదయం జరిగే అసెంబ్లీలో విద్యార్థులు సంస్కృత శ్లోకాలు చదువుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2010లో భారత్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి అక్టోబర్ 2009లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద నుండి ‘క్వీన్స్ బెటన్ రిలే’  ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  సెయింట్ జేమ్స్ స్కూల్ కి చెందిన పిల్లలు సంస్కృత శ్లోకాలు చదివినప్పుడు తీసింది. ఇదే విషయాన్ని వార్త సంస్థలు కూడా ప్రచురించాయి. ఐతే లండన్ లోని సెయింట్ జేమ్స్ స్కూల్ లో సంస్కృతంలో బోదిస్తూ, సంస్కృతాన్ని ప్రోత్సహిస్తున్న మాట నిజమైనప్పటికీ, ఈ వీడియో మాత్రం స్కూల్ అసెంబ్లీకి సంబంధించింది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని వీడియోలో కనిపిస్తున్న వాటర్ మార్క్ ఆధారంగా wildfilmsindia యూట్యూబ్ ఛానల్ లో వెతకగా ఈ ఛానల్ లో దీనికి సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ  వీడియోలకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం ఈ వీడియో 2010లో భారత్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి అక్టోబర్ 2009లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద నుండి ‘క్వీన్స్ బెటన్ రిలే’  ప్రారంభం సందర్భంగా సెయింట్ జేమ్స్ స్కూల్ కి చెందిన పిల్లలు సంస్కృత శ్లోకాలు చదివినప్పుడు తీసింది.

‘క్వీన్స్ బెటన్ రిలే’  అనేది 1958లో కార్డిఫ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మొదలైంది. అప్పటి నుండి ప్రతీ కామన్వెల్త్ గేమ్స్ లో ఇదే ఒక కర్టెన్ రైజర్ గా జరుగుతూనే ఉంది. కామన్వెల్త్ గేమ్స్ అధికారిక వెబ్సైటులో కూడా బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద జరిగిన 2010 గేమ్స్ కి సంబంధించిన బెటన్ రిలే కార్యక్రమం యొక్క వీడియో ఉంది. ఈ వీడియోలో  పిల్లలు సంస్కృత శ్లోకాలు చదువుతున్న విజువల్స్ చూడొచ్చు. బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద జరిగిన కార్యక్రమంలో సెయింట్ జేమ్స్ స్కూల్ కి చెందిన పిల్లలు సంస్కృత శ్లోకాలు చదివినట్టు వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

ఐతే వెస్ట్ లండన్ లో 1975లో స్థాపించిన సెయింట్ జేమ్స్ స్కూల్ లో సంస్కృతం బోధిస్తున్న మాట నిజమే. ఈ స్కూల్ లో జూనియర్ స్కూల్ విద్యార్థులందరికీ సంస్కృతం బోధిస్తుండగా, సీనియర్ స్కూల్ విద్యార్థులుకు సంస్కృతం తప్పనిసరి కాకుండా, కేవలం ఇష్టమున్నవారు సంస్కృతం చదవాలనుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ స్కూల్ సంస్కృతాన్ని ప్రోత్సహించే విషయాన్ని కొన్ని వార్తా సంస్థలు ఇంతకు ముందు కూడా ప్రచురించాయి. ఐతే పోస్టులో ఉన్న వీడియోలో సంస్కృత శ్లోకాలు చదువుతున్నది ఈ స్కూల్ విద్యార్థులే అయినా, ఇది స్కూల్ అసెంబ్లీలో చదివింది కాదు, 2010 కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి  బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద జరిగిన కార్యక్రమంలో చదివింది.

చివరగా, 2010 కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించిన వీడియోని స్కూల్ అసెంబ్లీ దంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll