నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకి అందించే ఆయుర్వేద మందు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ‘ఆయుర్వేద వైద్యులు నెల్లూరు ఆనందయ్యకు Z కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ఆయుర్వేద వైద్యులు నెల్లూరు ఆనందయ్యకు Z కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలు’.
ఫాక్ట్ (నిజం): ఆనందయ్యకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించాడన్నది కేవలం కల్పిత వార్త మాత్రమే. సెక్యూరిటీ అనేది ఉప రాష్ట్రపతి పరిధిలోని అంశం కాదు, ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం. కాకపోతే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించామని నెల్లూరు ఎస్పీ తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఆనందయ్య అందించే మందు కోసం జనాలు విపరీతంగా వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మందు శాస్త్రీయతపై నివేదిక వచ్చేవరకు మందు పంపిణిని నిలిపేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయుష్ సభ్యులు కృష్ణపట్నంలో ఆనందయ్య తాయారు చేస్తున్న మందులో ఉపయోగించే పదార్థాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసారని కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఐతే ఈ వార్తపై నెల్లూరు SP స్పందిస్తూ, ఆనందయ్యని అరెస్ట్ చేయలేదని, కేవలం ఆయనకు భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేసారు. ఆనందయ్య కూడా తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.
కృష్ణపట్నం ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు కోసం ప్రజలు విపరీతంగా వస్తుండడంతో ఈ విషయం తెలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మందుపై అధ్యయనం చేయాలని ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి కిరణ్ రిజిజు మరియు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ని కోరిన విషయం నిజమైనప్పటికి, ఆనందయ్యకు ‘Z కేటగిరి’ సెక్యూరిటీ అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించలేదు. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారంగాని లేక వార్తా కథనాలు గాని లేవు. పైగా ‘Z కేటగిరి’ సెక్యూరిటీ అనేది ఉపరాష్ట్రపతి పరిధిలోని అంశం కాదు. సెక్యూరిటీ విషయాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది.
ఎవరెవరికి వివిధ కేటగిరీల కింద సెక్యూరిటీ అందిస్తారు :
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ VIP మరియు VVIPలకు వారివారి ముప్పు అంచనా ప్రకారం వివిధ కేటగిరీల భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు, లోక్ సభ స్పీకర్లు, సుప్రీమ్ కోర్టు మరియు హై కోర్టు న్యాయమూర్తులు మొదలైన రాజ్యాంగబద్దమైన పదవులలో ఉన్నవారికి తమ పదవి కారణంగానో లేక ఇతర కారణాల వల్లనో ఉగ్రవాదులు, మిలిటెంట్ గ్రూపులు లేదా క్రిమినల్ గ్యాంగ్స్ వల్ల ముప్పు ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారివారి ముప్పు అంచనా ప్రకారం Z+, Z, Y, X మొదలైన కేటగిరీల కింద కేంద్ర బలగాల ద్వారా సెక్యూరిటీ అందిస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ఈ VIP, VVIP ముప్పుని అంచనా వేస్తూ వారికి ఉన్న ముప్పు అనుగుణంగా సెక్యూరిటీని అందిస్తుంది.
అలాగే పారిశ్రామిక వేత్తలకు మరియు ఇతర ప్రముఖులకు కూడా కేంద్ర ప్రభుత్వం వారికున్న ముప్పు అంచనా ప్రకారం సెక్యూరిటీ అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ప్రభుత్వానికి అభ్యర్దన చేసుకోవచ్చు కూడా. ఐతే ప్రభుత్వం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి భద్రత కల్పించాలో లేదో నిర్ణయం తీసుకుంటుంది.
సాధారణంగా భారత ప్రధానమంత్రి మరియు వారి కుటుంబ సభ్యులకు Special Protection Group Act, 1988లో నిర్దేశించిన విధంగా భద్రత కల్పిస్తారు. భారత మాజీ ప్రధాని మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా తన పదవీకాలం ముగిసినప్పటి నుండి ఐదేళ్లపాటు ఈ చట్టం ప్రకారమే భద్రత కల్పిస్తారు.
సాధారణంగా లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పార్లమెంట్ సభ్యులకు భద్రత కల్పిస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పైన తెలిపిన వ్యక్తులకు మాత్రమే కాకుండా రాష్ట్ర పరిధిలో ముంపు పొంచి ఉన్న ఇతరులకు కూడా భద్రత కల్పిస్తూ ఉంటుంది.
ఐతే ఆనందయ్యకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించాడన్నది కేవలం కల్పిత వార్త మాత్రమే. సెక్యూరిటీ అనేది ఉప రాష్ట్రపతి పరిధిలోని అంశం కాదు. కాకపోతే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించామని నెల్లూరు ఎస్పీ తెలిపారు.
చివరగా, ఆనందయ్యకు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించలేదు.