స్వాతంత్య్ర రాకముందు వరకు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నుండి సీతాదేవి జన్మస్థలం అయిన నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు తలంబ్రాలతో ఊరేగింపు వెళ్లేదని, కానీ ఆ తరవాత ఏర్పడిన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే చాలా కాలం నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని 2019లో విశ్వహిందు పరిషద్ (VHP) తిరిగి ప్రారంభించిందని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు జరిగే ఊరేగింపును స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం రద్దు చేసింది.
ఫాక్ట్(నిజం): VHP ‘రామ్ కి భారత్’ పేరుతో అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు ఊరేగింపు నిర్వహించడం 2004లో ప్రారంభించింది. అప్పటినుండి ఐదేళ్ళకు ఒకసారి ఈ ఊరేగింపు నిర్వహిస్తోంది. స్వాతంత్య్రం ముందు నుండే అయోధ్య- జనక్‌పూర్ ఊరేగింపు నిర్వహించేవారని, ఆ తరవాత ప్రభుత్వం రద్దు చేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పొతే స్వాతంత్య్రం కన్నా ముందు నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కూడా ‘రామ్ భారత్’ పేరుతో ఊరేగింపు నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే చరిత్రలో ఇది కేవలం నాలుగు సార్లు (1947,1948, 2020 & 2021) మాత్రమే రద్దైంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
VHP ‘రామ్ కి భారత్’ :
సుప్రీంకోర్టు అయోధ్య రామ మందిరం తీర్పు వెల్లడించిన 2019లో విశ్వ హిందూ పరిషత్ (VHP) శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నుండి నేపాల్‌లోని సీతాదేవి జన్మస్థలం అయిన జనక్‌పూర్ వరకు ఊరేగింపు నిర్వహించింది. ఈ ఊరేగింపుకు ‘రామ్ కి భారత్’ అని పేరు.
ఐతే VHP నిర్వహించే ఈ రామ్ కి భారత్ ఊరేగింపు 2004లో మొదలైంది. అయోధ్యలోని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ‘రామ్ కి భారత్’ ఊరేగింపు 2004లో మొదలైంది. అప్పటినుండి ప్రతీ ఐదేళ్ళకు ఒకసారి ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నాం. అంతకుముందు 2009 & 2014లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’ అని తెలిపాడు.

VHP నిర్వహించే ఈ ఊరేగింపు 2004లో మొదలైందని, అలాగే ఇది ఐదేళ్ళకు ఒకసారి జరుగుతుందని ధృవీకరిస్తున్న మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఆగ్రాలో కూడా ‘రామ్ కి భారత్’ నిర్వహిస్తారు:
ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నుండి ‘రామ్ భారత్’ పేరుతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఐతే ఈ ఊరేగింపు విశేషం ఏంటంటే, ప్రతీ సంవత్సరం ఆగ్రా చుట్టుపక్కల ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని జనక్‌పూర్‌గా అలంకరిస్తారు. ఆగ్రా నుండి ఈ ప్రాంతానికి ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ ఊరేగింపుకు సంబంధించిన కథనాల ప్రకారం ఈ ఊరేగింపు దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే నిర్వహించేవారు. ఐతే చరిత్రలో ఈ ఊరేగింపు 1947 & 1948లో దేశ విభజన జరినప్పుడు, మళ్ళీ తిరిగి ఇటీవల కరోనా సమయంలో (2020 & 21) మాత్రమే రద్దైంది (ఇక్కడ & ఇక్కడ).

దీన్నిబట్టి 2004 కన్నా ముందు VHP ఇలాంటి ఊరేగింపు నిర్వహించలేదని స్పష్టమవుతుంది. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఇలాంటి (అయోధ్య- నేపాల్) ఊరేగింపు స్వాతంత్య్రం రాకముందు నుండి జరిగేదని, స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఏర్పడ్డ ప్రభుత్వం నిలిపివేసిందన్న వాదనను ధృవీకరించే ఆధారలేవి మాకు లభించలేదు.
చివరగా, VHP అయోధ్య-జనక్‌పూర్ వరకు ‘రామ్ కి భారత్’ ఊరేగింపును 2004లో ప్రారంభించింది.