Fake News, Telugu
 

ఊర్వశి రౌతేలా బెంజమిన్ నెతన్యాహుకు భగవద్గీత బహుమతి మాట వాస్తవం; కాని తాను ‘మిస్ యూనివర్స్‌’ కాదు

0

మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు భగవద్గీత బహుమతిగా ఇచ్చారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు భగవద్గీతని బహుమతిగా ఇచ్చారు.

ఫాక్ట్ (నిజం): బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి భగవద్గీతని బహుమతిగా ఇచ్చిన మాట వాస్తవం. కాని, పోస్టులో చెబుతున్నట్టు ఊర్వశి రౌతేలా మిస్ యూనివర్స్‌  కిరీటాన్ని దక్కించుకోలేదు. మిస్ యూనివర్స్ 2015 పోటీలలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఊర్వశి రౌతేలా, ఆ పోటిలో టాప్-15లో కూడా స్థానం పొందలేదు. ఇజ్రాయిల్ ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీలకు ఊర్వశి రౌతేలాను జడ్జ్ ప్యానెల్‌ సభ్యులలో ఒకరిగా నియమించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలుసుకొని భగవద్గీతని బహుమతిగా ఇచ్చినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. ఇజ్రాయిల్ ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటిలకు ఊర్వశి రౌతేలాను జడ్జ్ ప్యానెల్‌ సభ్యులలో ఒకరిగా నియమించారు. మిస్ యూనివర్స్ 2021 పోటీల కోసం ఇజ్రాయిల్ వెళ్ళిన ఊర్వశి రౌతేలా, బెంజమిన్ నెతన్యాహును కలుసుకొని భగవద్గీతని బహుమతిగా ఇచ్చినట్టు తెలిసింది. బెంజమిన్ నెతన్యాహుకు భగవద్గీతని బహుమతిగా ఇస్తున్న ఫోటోని, కొన్ని హిందీ పదాలను నెతన్యాహుకు నేర్పిస్తున్న  వీడియోని ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియా పేజిలలో షేర్ చేసింది.

అయితే, పోస్టులో తెలుపుతున్నట్టు ఊర్వశి రౌతేలా మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇప్పటివరకు దక్కించుకోలేదు. ‘మిస్ దివా 2015’ పోటీలలో ఊర్వశి రౌతేలా విజేతగా నిలిచి, అదే సంవత్సరంలో జరిగిన ‘మిస్ యూనివర్స్ 2015’ పోటీలలో భారత దేశం తరుపున ప్రాతినిధ్యం వహించింది. అయితే, ‘మిస్ యూనివర్స్ 2015’ పోటిలో ఊర్వశి రౌతేలా టాప్-15లో చేరుకోలేక వెనుదిరిగింది. 13 డిసెంబర్ 2021 నాడు జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటిలలో భారత దేశానికి చెందిన హర్నాజ్ సంధూ విజేతగా నిలిచింది. భారత దేశం తరుపున సుస్మితా సేన్, లారా దత్తా తరువాత ఈ ఘనత అందుకున్నది హర్నాజ్ సంధూ మాత్రమే. ఈ వివరాల ఆధారంగా పోస్టులో తెలుపుతున్నట్టు ఊర్వశి రౌతేలా మిస్ యూనివర్స్‌గా ఎప్పుడూ ఎన్నికవలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బెంజమిన్ నెతన్యాహుకు భగవద్గీతని బహుమతిగా ఇచ్చిన మాట వాస్తవం; కాని తను మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll