2016 కన్నా ముందు ఆధార్ కార్డు పొందిన వారు ఇప్పుడు కచ్చితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 2016 కన్నా ముందు ఆధార్ కార్డు పొందిన వారు ఇప్పుడు కచ్చితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి.
ఫాక్ట్(నిజం): ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు దాటినా ఒక్కసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారిని అప్డేట్ చేసుకోవాలని కోరుతూ UIDAI గత సంవత్సరం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐతే అందరూ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి కాదని, కాకపోతే అప్డేట్ చేసుకుంటే మెరుగైన సేవలు అందించవచ్చని తెలుపుతూ ఒక వివరణ విడుదల చేసింది. అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు సస్పెండ్ అవ్వుతుందన్న వార్తలో ఎటువంటి నిజంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఆధార్ కార్డు జారీ అయ్యి 10 సంవత్సరాలు దాటి ఒక్కసారి కూడా వివరాలను (పేరు, చిరునామా, మొదలైన వివరాలు) అప్డేట్ చేసుకొని వారిని ఈ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ UIDAI నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐతే అందరూ కచ్చితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని మాత్రం UIDAI ఎటువంటి నిబంధన పెట్టలేదు. ఈ UIDAI నోటిఫికేషన్‌ను తప్పుగా అర్ధం చేసుకొని అందరూ కచ్చితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే ఆధార్ కార్డులు సస్పెండ్ అవుతాయని ప్రచారం జరగడంతో ఈ వార్తలపై UIDAI వివరణ కూడా ఇచ్చింది.

అందరూ ఆధార్ వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాకపోతే, పది సంవత్సరాల వరకు ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోని వారు అప్డేట్ చేసుకుంటే మంచిదని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఇలా అప్డేట్ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడం వీలవుతుందని తెలిపింది.
UIDAI వివరణను అప్పట్లో వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఆధార్ అప్డేట్‌కు సంబంధించిన కొన్ని సందేహాలకు సమాధానాలు UIDAI వెబ్సైటులో చూడొచ్చు. దీన్నిబట్టి ఆధార్ వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి కాదు. అప్డేట్ చేసుకోకపొతే కార్డు సస్పెండ్ కాదు.