Fake News, Telugu
 

హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇవ్వడం లేదని ఈ వీడియో షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్‌లో హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇవ్వడం లేదని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరు, దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: ఒవైసీకి రూమ్ నిరాకరించడం వాస్తవమే. కానీ, ఒవైసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హోటల్ బయట, మాస్క్ లేకుండా గుమిగూడటంతో హోటల్ వారు ఒవైసీకి రూమ్ ఇవ్వలేదు. వీడియోలో సంఘటన జులై 2021లో జరిగింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో సంఘటనలో కూడా ఒవైసీకి పోలీస్ పర్మిషన్ కోసమని మొదట్లో రూమ్ నిరాకరించినా, తర్వాత అదే హోటల్ లో ఒవైసీ బస చేసారు. ఈ రెండు ఘటనల్లో ఎక్కడా కూడా హిందూ హోటల్ యజమానులు కావాలనుకొని ఒవైసీకి రూమ్స్ ఇవ్వకపోవడం జరగలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఒక ఫోటో ఒక ఆర్టికల్‌లో లభించింది. 16 జులై 2021న ప్రచురించిన ఈ ఆర్టికల్‌లో ఒవైసీకి మోరాదాబాద్, ఉత్తరప్రదేశ్‌లో హోటల్ రూమ్ ఇవ్వలేదని తెలిపారు. ఒవైసీ ఈ 5-star హోటల్‌కు వస్తున్నారని తెలిసి ఆయన్ని కలవడానికి జనాలు బాగా పోగయ్యారు, దీనికి హోటల్ మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు అక్కడికి వచ్చిన ఒవైసీ మద్దతుదారులు ఎవరూ మాస్క్ వేసుకోకపోవడంతో ఒవైసీకి హోటల్ రూమ్ నిరాకరించారని తెలుస్తుంది. ఒవైసీ మద్దతుదారులు ఆ హోటల్ బీజేపీ లీడర్‌ది కావడంతో రూమ్ ఇవ్వలేదని అన్నారు. కానీ, ఎక్కడా కూడా హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరని లేదు.

ఇటీవల, ఒవైసీకి సంబంధించి ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. AIMIM ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ ఒవైసీకి రూమ్ గురించి తెలుసుకోడానికి వెళ్ళినప్పుడు డ్రైవ్ ఇన్ 24 హోటల్ వారు, అతను రాజకీయ నాయకుడు కాబట్టి పోలీస్ పర్మిషన్ అవసరం అవుతుందని తెలిపారు. దీంతో, బుక్ చేసిన రూంకి ఇలా ఏంటని మొదట్లో కోపగించుకున్న షౌకత్ అలీ, తర్వాత పోలీస్ వారితో మాట్లాడినట్టు మీడియాతో తెలిపారు. ఎందుకు ఇలా ఒవైసీకి తరచూ అవుతుందని అడిగిన ప్రశ్నకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒవైసీని చూసి బయపడుతోందని ఆయన తెలిపారు. హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరని ఎక్కడా కూడా అనలేదు.

ఉత్తరప్రదేశ్‌లో హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరని బాగా వైరల్ అవ్వటంతో, OpIndia వారు అక్కడ హోటల్ ఉద్యోగితో మాట్లాడినప్పుడు దీన్ని వారు ఖండించారు. విఐపిలకు గదులు కేటాయించడానికి ముందు హోటల్ కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి వచ్చిందని, ఒవైసీ హోటల్‌లో ఆహ్లాదకరమైన బస చేసినట్లు తెలిపారు.

చివరగా, హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరని ఈ వీడియో షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll