Fake News, Telugu
 

వైకాపా/బీజేపీకి ఓటు వేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక వ్యక్తి తన వేలిని నరుక్కున్నాడంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

0

మోదీ మాయ మాటలు నమ్మి బీజేపీకి ఓటు వేసినందుకు ప్రాయశ్చిత్తంగా, వోట్ వేసిన తన చేతి వేలును నరుక్కుంటున్నాడంటూ, సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదే వీడియోని మరికొందరు, వైకాపాకి ఓటు వేసినందుకు వేలు నరుక్కున్నాడు అంటూ షేర్ చేస్తున్నారు. ఈ రెండు పోస్టులలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వైకాపా/బీజేపీకి వోటు వేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక వ్యక్తి తన వేలిని నరుక్కుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): మహారాష్ట్ర ఉల్హాసనగర్ వాసి అయిన ధనంజయ్ ననానవారే, తన సోదరుడు, సోదరుడి భార్య ఆత్మహత్యకు రాజకీయ నాయకులకు సంబంధం ఉందని, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని నిరసన తెలుపుతూ తన వేలుని నరుకున్నాడు. ఈ వీడియో ఈ సంఘటనకి సంబంధించిందే. అధికారులు చర్యలు చేపట్టే దాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తన ఒక్కొక్క అవయవం నరుక్కొని ఇస్తానని ధనంజయ్ హెచ్చరించాడు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులోని వ్యక్తి మాట్లాడే భాషను బట్టి, మహారాష్టలో ఇటీవల ఇటువంటి ఘటన జరిగిందా అని ఇంటర్నెట్లో వెతకగా, మహారాష్ట్రలోని సతారా జిల్లా, పల్తాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పలు వార్త పత్రికల ద్వారా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) తెలిసింది.

మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ లో నివసించే ధనంజయ్ నానవారే సోదరుడు నందకుమార్ నానవారే, అతని భార్య, ఒక వీడియో క్లిప్‌ను రికార్డ్ చేస్తూ తమ ఆత్మహత్యకు చాలా మందిని బాధ్యులుగా పేర్కొన్నారు, తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తన సోదరుడు పేర్కొన్న వారిలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు అని, అది తెలిసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని నిరసన తెలుపుతూ ధనంజయ్ తన వేలుని నరుకున్నాడు. అధికారులు చర్యలు చేపట్టే దాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తన ఒక్కొక్క అవయవం నరుక్కొని ఇస్తానని ధనంజయ్ హెచ్చరించాడు ఈ వీడియో తరువాత, థానే క్రైమ్ బ్రాంచ్ నందకుమార్ పేర్కొన్న వారిలో నలుగురిని అదుపులోకి తీసుకుంది.

చివరిగా, ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని న్యాయం కోరుతూ తన వేలు నరుక్కున్న వీడియోను బీజేపీకి లేదా వైకాపాకి ఓటు వేసినందుకు ప్రాయశ్చిత్తంగా వేలు నరుక్కున్నాడు అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll