Fake News, Telugu
 

బ్రెజిల్ దేశానికి చెందిన సంబంధం లేని వీడియోని మణిపూర్‌లో ముస్లింలు క్రైస్తవుడిపై దాడి చేసి అతని ముఖాన్ని రెండుగా చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మణిపూర్‌లోని ముస్లింలు ఒక క్రైస్తవుడిపై కిరాతకంగా దాడి చేసి అతని ముఖాన్ని రెండుగా చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఈ వీడియోని సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్‌లో ముస్లింలు ఒక క్రైస్తవుడిపై కిరాతకంగా దాడి చేసి అతని ముఖాన్ని రెండుగా చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. ఈ వీడియో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినది కాదు, అలాగే, ఈ ఘటనలో మతపరమైన కోణమేమీ లేదు.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు వెబ్సైట్లు ఇటీవల పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుందని ఈ వెబ్సైటులలో రిపోర్ట్ చేసారు.  

ఈ వీడియోలో క్షతగాత్రుడికి చికిత్స అందిస్తున్న నర్సు డ్రెస్సుపై ‘Caxias’ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. కాక్సియాస్ అనేది బ్రెజిల్ దేశానికి చెందిన ఒక నగరం.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, వీడియోలోని ఘటనకు సంబంధించి ‘Portal do Zacarias’ అనే వార్తా సంస్థ 09 జులై 2023 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. పతంగులు (kites) ఎగరేసేందుకు ఉపయోగించే వాక్స్ లైన్లు లేదా దారానికి ప్రమాదవశాత్తు బలంగా గీసుకోవడంతో వీడియోలోని వ్యక్తి ముఖం రెండు భాగాలుగా చీలిపోయిందని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో బ్రెజిల్ దేశానికి సంబంధించినదని అలాగే, ఈ ఘటనలో మతపరమైన కోణమేమీ లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బ్రెజిల్ దేశానికి చెందిన సంబంధం లేని వీడియోని మణిపూర్‌లో ముస్లింలు క్రైస్తవుడిపై దాడి చేసి అతని ముఖాన్ని రెండుగా చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll