Fake News, Telugu
 

కీర్తిచక్ర కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతి ఫోటోపై కామెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారంటూ సంబంధం లేని ఫోటోను షేర్ చేస్తున్నారు

0

సోషల్ మీడియాలో కీర్తిచక్ర దివంగత కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతి ఫోటో కింద ఢిల్లీకి చెందిన అహ్మద్ కే అనే వ్యక్తి అసభ్యకరంగా కామెంట్ పెట్టినట్టు రిపోర్ట్ అయిన విషయం తెలిసిందే. ఐతే పోలీసులు అహ్మద్‌ను అరెస్ట్ చేసారు అంటూ ఒక ఫోటో షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సోషల్ మీడియాలో కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతి ఫోటో కింద అసభ్యకరంగా కామెంట్ పెట్టిన అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో ఉన్నది మహ్మద్ కాసిమ్‌ అనే స్నాచింగ్ కేసు నిందితుడు. ఇతన్ని 02 జూలై 2024న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసారు. కాగా స్మృతి సింగ్ రాష్ట్రపతి ద్వారా అవార్డు తీసుకుంది 02 జూలై 2024 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో, దీన్నిబట్టి  స్మృతి సింగ్ ఫొటోపై కామెంట్ చేసింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కాదని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కెప్టెన్ అన్షుమన్ సింగ్‌ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. 05 జులై 2024 నాడు ఈ అవార్డును ఆయన భార్య స్మృతి సింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదిగా స్వీకరించారు. అయితే స్మృతి సింగ్ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి, కొందరు మీడియాలో స్మృతి సింగ్ ఫోటోపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌ అయ్యింది. ఢిల్లీకి చెందిన అహ్మద్ కే అనే వ్యక్తి అసభ్యకరంగా కామెంట్ పెట్టినట్టు తాము గుర్తించామని కమిషన్ పేర్కొంది. అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేసింది.

ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోలో ఉన్నది స్మృతి సింగ్ ఫోటోపై అసభ్యకర కామెంట్స్ చేసిన వ్యక్తి కాదు. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను సెంట్రల్ ఢిల్లీ డిసిపి తమ ట్విట్టర్ ద్వారా 06 జులై 2024న షేర్ చేసినట్టు తెలిసింది (ఆర్కైవ్). ఈ ట్వీట్ ప్రకారం ఫొటోలోని వ్యక్తి మొహమ్మద్ కాసిమ్‌ అని, ఇతను స్నాచింగ్ కేసు నిందితుడు అని తెలిసింది.

మరింత వెతికే క్రమంలో కొన్ని లోకల్ యూట్యూబ్ చానెల్స్ ఈ ఫోటోను 05 జులై 2024 నాడు రిపోర్ట్ చేసిన వీడియోలు (ఇక్కడ & ఇక్కడ) మాకు కనిపించాయి (ఆర్కైవ్). ఈ రిపోర్ట్స్ ప్రకారం ఫొటోలోని వ్యక్తి మొహమ్మద్ కాసిమ్‌, ఇతనిపై 2018 నుండి మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న ఇతన్ని 02 జూలై 2024న, హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌ పోలీసులు ఢిల్లీలోని అతని నివాసం నుండి పట్టుకున్నారు.

అలాగే కొన్ని OSINT టూల్స్ (ఇక్కడ & ఇక్కడ) ద్వారా పైన తెలిపిన వీడియోలు 05 జూలై 2024 నాడు ఉదయం 11:32 టైంలో అప్లోడ్ అయ్యాయని తెలిసింది. కాగా స్మృతి సింగ్ రాష్ట్రపతి ద్వారా అవార్డు తీసుకుంది అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో, అంటే ఆమె ఫోటోపై కామెంట్ చేసిన ఘటన కన్నా ముందే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో అందుబాటులో ఉంది. దీన్నిబట్టి  స్మృతి సింగ్ ఫొటోపై కామెంట్ చేసింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కాదని స్పష్టమవుతుంది.

చివరగా, కీర్తిచక్ర దివంగత కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతి ఫోటోపై కామెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారంటూ సంబంధం లేని ఫోటోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll