Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలను ముస్లింలు, మోదీ వ్యతిరేకులు ఇటీవల రైల్వే ట్రాక్‌లను నాశనం చేస్తూ, రైళ్లపై సిలిండర్లు విసురుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఒడిశాలోని బహణగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో, కదులుతున్న రైలు ముందు ముస్లింలు గ్యాస్ సిలిండర్ విసిరేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ముస్లింలు కదులుతున్న రైలుపై రాళ్ళు రువుతున్న దృశ్యాలంటూ మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అంతేకాదు, నరేంద్ర మోదీని వ్యతిరేకించే వారు కావాలని రైల్వే ట్రాక్‌లపై ఉన్న నట్లను తీసివేస్తూ మళ్ళీ రైలు ప్రమాదాలు జరగాలని పన్నాగం పన్నుతున్న దృశ్యాలంటూ మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లింలు, మోదీ వ్యతిరేకులు ఇటీవల రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేస్తూ, కదులుతున్న రైళ్లపై సిలిండర్లు, రాళ్ళు రువ్వుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన మూడు వీడియోలు పాతవి. కదులుతున్న రైలుపై సిలిండర్ విసిరేసిన దృశ్యాలకు సంబంధించి నార్త్ ఈస్టర్న్ రైల్వే అధికారులు ఇటీవల ఒక ట్వీట్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 2022 జులై నెలలో జరిగిన ఘటనను చూపిస్తుందని, ఈ ఘటనకు కారకుడైన నిందితుడి పేరు గంగారామ్ అని రైల్వే అధికారులు ట్వీట్లో స్పష్టం చేశారు. పోస్టులో షేర్ చేసిన రెండవ వీడియో కనీసం 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇక చివరి వీడియో, 2022లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు భరత్‌పుర్‌లో రైలులను నిలిపివేసి, రైల్వే ట్రాక్‌పై ఉన్న నట్లను తీస్తున్న దృశ్యాలని చూపిస్తుంది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో 1:

ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్‌వానిలో కదులుతున్న రైలు ముందు గ్యాస్ సిలిండర్‌ను విసిరేసిన ముస్లింలు అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోకి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ వీడియోకి సంబంధించి ఇటీవల ‘ETV Bharat’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గత సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్‌వానిలో చోటుచేసుకున్న ఘటనను చూపిస్తుందని ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నార్త్ ఈస్టర్న్ రైల్వే అధికారులు ఇటీవల ఒక ట్వీట్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 2022 జులై నెలలో జరిగిన ఘటనను చూపిస్తుందని, ఈ ఘటనకు కారకుడైన నిందితుడి పేరు గంగారామ్ అని రైల్వే అధికారులు ట్వీట్లో స్పష్టంగా పేర్కొన్నారు.  పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, ఇందులో మతపరమైన కోణం ఏది లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో 2:

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం సమూహం ఇటీవల రైలులపై రాళ్ళు రువ్వుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కనీసం 2019 నుండి సోషల్ మీడియాలో యూసర్లు షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. ఈ వీడియో ఎక్కడిదో స్పష్టంగా తెలుసుకోలేనప్పటికి, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, ఒడిశా రైలు ప్రమాదం తరువాత చోటుచేసుకున్న ఘటన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో 3:

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొందరు నరేంద్ర మోదీ వ్యతిరేకులు రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేస్తూ, వాటిపై ఉన్న నట్లను తీసివేస్తున్న దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలను 2022లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌లో దొరికింది. 2022లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు భరత్‌పుర్‌లో రైలులను నిలిపివేసి, రైల్వే ట్రాక్‌పై ఉన్న నట్లను తీస్తున్న దృశ్యాలంటూ ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. 2022లో భరత్‌పుర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి.

చివరగా, సంబంధం లేని పాత వీడియోలను ముస్లింలు, మోదీ వ్యతిరేకులు ఇటీవల రైల్వే ట్రాక్‌లను నాశనం చేస్తూ, రైళ్లపై సిలిండర్లు, రాళ్ళు రువ్వుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll