Fake News, Telugu
 

మయన్మార్ దేశ వీడియోని మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు హిందూ మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. కొందరు మిలిటెంట్లు ఒక మహిళను దారుణంగా కొట్టి చివరకు తుపాకితో కాల్చి చంపిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

 

క్లెయిమ్: మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు హిందూ మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన 2022లో మయన్మార్ దేశంలోని టాము అనే పట్టణంలో చోటుచేసుకుంది. 2022 జూన్ నెలలో మయన్మార్‌లోని పీపుల్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) 4వ బెటాలియన్‌కి చెందిన మిలిటెంట్లు, టాము పట్టణంలోని ఒక యువతిని, మయన్మార్ సైన్యానికి గుఢచర్యం చేస్తుందని అనుమానించి, ఆమెను దారుణంగా హింసించి కాల్చి చంపారు. ఈ వీడియోకి మణిపూర్‌లో ప్రస్తుతం కుకి మైతేయ్ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ఒక వెబ్సైట్ 2022 డిసెంబర్ నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మయన్మార్ దేశంలో ఒక మహిళపై జరిగిన క్రూరమైన దాడి యొక్క దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఘటనకు సంబంధించి ‘DVB’ అనే వార్తా సంస్థ 08 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. మయన్మార్‌లోని టాము అనే పట్టణంలో ఒక యువతిని దారుణంగా హింసించి కాల్చి చంపేసిన దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పలు ఇతర వార్తా సంస్థలు కూడా 2022 డిసెంబర్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 2022 జూన్ నెలలో మయన్మార్‌లోని పీపుల్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) 4వ బెటాలియన్‌కి చెందిన మిలిటెంట్లు, టాము పట్టణంలోని ఒక యువతి, మయన్మార్ సైన్యానికి గుఢచర్యం చేస్తుందని అనుమానించి, ఆమెను దారుణంగా హింసించి కాల్చి చంపేసినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.  

2022 డిసెంబర్ నెలలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, యువతిని హత్య చేసిన మిలిటెంట్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మయన్మార్ నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) హామీ ఇచ్చింది. ఈ నేరంలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మిగితా నేరస్థులను కూడా అరెస్ట్ చేస్తామని NUG తరువాత ప్రకటించింది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో మయన్మార్ దేశానికి సంబంధించిందని, మణిపూర్‌లో ప్రస్తుతం కుకి మైతేయ్ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మయన్మార్ దేశానికి సంబంధించిన వీడియోని మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు హిందూ మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll