Fake News, Telugu
 

కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 మరియు మణిపూర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 371C రెండూ భిన్నమైన నిబంధనలు

0

‘మొన్నటిదాకా కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఉన్నట్టు మణిపూర్‌లో ఇప్పటికీ ఆర్టికల్ 371C అమలులో ఉందని’ చెప్తూ ఆర్టికల్ 370తో ఆర్టికల్ 371Cను పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఉన్నట్టు మణిపూర్‌లో ఇప్పటికీ ఆర్టికల్ 371C అమలులో ఉంది.

ఫాక్ట్(నిజం):  ఆర్టికల్ 370తో మణిపూర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 371Cను పోల్చడం సరి కాదు. ఇవి రెండు చాలా బిన్నమైనవి. ఆర్టికల్ 371C అనేది మణిపూర్ రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలను మాత్రమే నిర్వచిస్తుంది. ఈ ఆర్టికల్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులతో కూడిన ఒక కమిటీను ఏర్పాటుకు చేసే అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది. ఆర్టికల్ 370 లాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర చట్టాలు అమలు కాకపోవడం, ఇతర రాష్ట్రాల వారు స్థలాలు కొనడానికి అనుమతి లేకపోవడం వంటి నిబంధనలు ఏవీ ఆర్టికల్ 371Cలో లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను నిర్వచిస్తుంది. 1971లో చేసిన 27వ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్‌ను తీసుకొచ్చారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 370 కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఎలాగైతే కల్పించిందో, అలాంటి సదుపాయం ఏదీ కూడా 371C మణిపూర్‌కు కల్పించలేదు.

ఆర్టికల్ 371C అనేది మణిపూర్ రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలను మాత్రమే నిర్వచిస్తుంది. ఈ ఆర్టికల్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులతో కూడిన ఒక కమిటీను ఏర్పాటుకు చేసే అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది. గవర్నర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ కమిటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది.

ఆర్టికల్ 371 పదకొండు రాష్ట్రాలకు వర్తిస్తుంది:

ఐతే ఇలా ఆర్టికల్ 371 కింద ప్రత్యక నిబంధనలు కేవలం మణిపూర్‌కి మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాలతో సహా (త్రిపుర & మేఘాలయ మినహా) 11 రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలను కలిగి ఉన్నాయి.

గుజరాత్, కర్ణాటక, మొదలైన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ కూడా ఆర్టికల్ 371 కింద కొన్ని ప్రత్యేక నిబంధనలను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1973లో ఆర్టికల్ 371Dను తీసుకొచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇప్పుడు ఈ ఆర్టికల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడానికి దీనిని తీసుకువచ్చారు. ఈ ఆర్టికల్ కింద ఏ ఉద్యోగంలో ఏ తరగతి వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వవచ్చో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే హక్కు రాష్ట్రపతికి ఉంది.

ఆర్టికల్ 370తో పోల్చడం సరి కాదు:

దీన్నిబట్టి మణిపూర్‌కు సంబంధించిన ఆర్టికల్ 371Cను కశ్మీర్‌లోని ఆర్టికల్ 370ను పోల్చడం సరికాదు అని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 లాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర చట్టాలు అమలు కాకపోవడం, ఇతర రాష్ట్రాల వారు స్థలాలు కొనడానికి అనుమతి లేకపోవడం వంటి నిబంధనలు ఏవి కూడా ఆర్టికల్ 371Cలో లేవు.

గతంలో కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన సమయంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టికల్ 371ను రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐతే ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి అసంపూర్ణ సమాచారం షేర్ చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఆస్కారం ఉంది.

చివరగా, కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 మరియు మణిపూర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 371C రెండూ భిన్నమైనవి.

Share.

About Author

Comments are closed.

scroll