Fake News, Telugu
 

CGTMSE కింద 85% ప్రభుత్వ గ్యారెంటీతో 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ పొందవచ్చు

0

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CGTMSE స్కీం ద్వారా ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ పొందవచ్చని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 85% లోన్ అమౌంట్‌కు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని, బ్యాంకులు ఈ లోన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని కూడా ఈ వీడియోలో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ CGTMSE స్కీం ద్వారా ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ అందిస్తుంది.

ఫాక్ట్(నిజం): CGTMSE కింద ప్రభుత్వ గ్యారెంటీతో బిజినెస్ లోన్స్ 5 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు. ఐతే బ్యాంకులు అప్లికేషన్‌లను పరిశీలించి వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రతిపాదనలకు మాత్రమే రుణాలు అందిస్తారు. అలాగే రుణాల విలువ ఆధారంగా ప్రభుత్వం అందించే గ్యారెంటీ మారుతుంది. అలాగే ప్రతీ సంవత్సరం ఈ గ్యారెంటీకి సంబంధించి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కావున పోస్టు ద్వారా తెలిపిన సమాచారం అసంపూర్ణంగా ఉంది.

సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల (MSME) కోసం ఎటువంటి తాకట్టు/థర్డ్ పార్టీ  గ్యారెంటీ లేకుండా అందించే ఉద్దేశంతో 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (CGTMSE)ను ఏర్పాటు చేసింది.

అప్పటికే బిజినెస్ చేస్తున్న లేదా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న (సోలో ప్రొప్ప్రియేటర్‌షిప్ సంస్థ, యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు) వారు ఈ స్కీం కింద బ్యాంకులు/ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుండి ఎటువంటి తాకట్టు లేకుండా 5 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు.

లబ్దిదారులను బ్యాంకులు సెలెక్ట్ చేస్తాయి:

ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చెప్తున్నట్టు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న అందరికీ రుణాలు ఇవ్వరు. రుణాలు అందించే సంస్థలు తమ వివేకం/విచక్షణ ఉపయోగించి అప్లికేషన్‌లను పరిశీలించి వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రతిపాదనలకు మాత్రమే రుణాలు అందిస్తారు.

ఈ పథకం కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు/ సూక్ష్మ ఆర్థిక సంస్థలు 50 లక్షలకు వరకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు మరియు షెడ్యూల్డ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు 2 కోట్ల వరకు,  పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు 5 కోట్ల వరకు అర్హత కలిగిన రుణగ్రహీతలకు రుణాలు అందిస్తారు.

ప్రభుత్వ గ్యారెంటీ:

అదేవిధంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం 85% గ్యారెంటీ అందించదు. ప్రభుత్వం అందించే గ్యారెంటీ సంబంధించి కొన్ని షరతులు ఉన్నాయి. ఐతే రుణాలు పొందాలనుకునే సంస్థలకు 5 లక్షల లోపు రుణాలకు 85% గ్యారెంటీను ప్రభుత్వం అందిస్తుంది. అలాగే  5 కోట్ల రుణాలకు 75% గ్యారెంటీ ప్రభుత్వం అందిస్తుంది. అలాగే మహిళా వ్యాపారవేత్తలు / SC/STలకు/ వైకల్యం ఉన్న వ్యక్తులు ఎంత ఋణం తీసుకున్న ప్రభుత్వం 85% గ్యారెంటీను అందిస్తుంది. ఏ క్యాటగిరీకి ఎంత వరకు ప్రభుత్వ గ్యారెంటీ వస్తుందో కింది టేబుల్‌లో చూడొచ్చు.

వార్షిక గ్యారెంటీ ఫీజు:

ఐతే ఈ రుణాలకు ప్రతీ సంవత్సరం కొంత గ్యారెంటీఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గ్యారెంటీఫీజు అనేది తీసుకునే రుణ విలువపై ఆధారపడి ఉంటుంది. రుణాల రిస్క్ ఆధారంగా కూడా ఈ ఫీజులో వ్యత్యాసం ఉంటుంది. ఏయే క్యాటగిరీకి ఎంత గ్యారెంటీఫీజు ఉంటుందనేది కింది టేబుల్‌లో చూడొచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2023 నాటికీ ఈ పథకం కింద సుమారు 4 లక్షల కోట్ల విలువైన గ్యారంటీలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, CGTMSE కింద 85% ప్రభుత్వ గ్యారంటీతో 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ పొందవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll