Fake News, Telugu
 

ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ఆర్ధిక అంశాలకు సంబంధించి ఎటువంటి ర్యాంకింగ్స్ ని విడుదల చేయదు

0

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం 163వ స్థానంలో ఉందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశానిది 163వ స్థానం.

ఫాక్ట్(నిజం): ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆర్ధిక అంశాలకు సంబంధించి ఎటువంటి ర్యాంకింగ్స్ ని విడుదల చేయదు. కాబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశానిది 163వ స్థానం అన్న వార్తలో నిజం లేదు. అక్టోబర్ 2020లో (IMF) విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ అనే ఒక సంస్థ నవంబర్ 2020లో GDP వృద్ది అనే అంశంపై ఇచ్చిన ర్యాంకింగ్స్ లో భారత దేశ ర్యాంక్ 164గా ఉంది, ఈ ర్యాంక్ ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 163వ స్థానంలో ఉన్నట్టు తప్పుగా అర్ధం చేసుకున్నారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ఆర్ధిక అంశాలకు సంబంధించి ఎటువంటి ర్యాంకింగ్స్ ని విడుదల చేయదు. కాబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశానిది 163వ స్థానం అన్న వార్తలో నిజం లేదు.

1971 నుండి చారిత్రక, భౌగోళిక మొదలైన కారణాల వల్ల అభివృద్ధి కాలేక పోతున్న దేశాలను Per capita income, Human assets, Economic vulnerability వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ (LDC) గా వర్గీకరిస్తుంది. ఈ లిస్టులో ప్రస్తుతం 46 దేశాలు ఉన్నాయి, ఐతే ఈ లిస్టులో భారత దేశం లేదు.   

సాధారణంగా ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్(HDI) విడుదల చేస్తుంది. మానవ అభివృద్ధిని కేవలం ఆర్ధిక విషయాలతో ని కాక మరింత సమగ్రంగా విశ్లేషించడానికి ఆరోగ్యం (life expectancy at birth), విద్య (expected years of schooling) మరియు జాతీయ తలసరి ఆదాయం (gross national income (GNI) per capita) వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ విడుదల చేస్తుంది, ఈ రిపోర్ట్ లో ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి చివరగా 2020లో విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో భారత దేశం 131వ ర్యాంక్ లో నిలిచింది.

ఐతే మరి ఈ 163వ ర్యాంక్ అనేది ఎక్కడి నుండి వచ్చింది?

అక్టోబర్ 2020లో ఇంటర్నేషనల్ మోనేటరీ ఫండ్ (IMF) వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ రిపోర్ట్ ప్రపంచ దేశాల GDP వృద్దికి సంబంధించి విడుదల చేసిన గణాంకాలలో 2020 సంవత్సరానికి గాను భారత దేశ GDP వృద్ది రేటు ‘-10.289’ గా ఉంటుందని అంచనా వేసింది, అదే విధంగా పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా లెక్కించినప్పుడు 2020వ సంవత్సరంలో భారత దేశ GDP 8,681.303 బిలియన్ డాలర్లు గా ఉందని ఈ అంచనా తేల్చింది.

ఐతే ఇంటర్నేషనల్ మోనేటరీ ఫండ్ (IMF) విడుదల చేసిన ఈ గణాంకాల ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ అనే ఒక సంస్థ నవంబర్ 2020లో ప్రపంచ దేశాలకు వివిధ అంశాలలో ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఐతే ఈ సంస్థ GDP వృద్ది అనే అంశంలో ఇచ్చిన ర్యాంకింగ్స్ లో భారత దేశ ర్యాంక్ 164గా ఉంది. ఈ ర్యాంకింగ్ ని ఇటీవల ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు తన ట్విట్టర్ ఎకౌంటు లో షేర్ చేయడంతో చాలా మంది ఈ ట్వీట్ ని షేర్ కూడా చేసారు. ఐతే పోస్టులో చెప్తున్నది ఈ ర్యాంకింగ్స్ ఆధారంగానే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం 163 ర్యాంక్ లో ఉందని చెప్తూ ఎటువంటి అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ విడుదల చేయలేదు. కాకపోతే 2020 సంవత్సరానికి GDP వృద్ది రేట్ లో 164 స్థానంలో ఉన్న భారత దేశ ర్యాంక్ ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశానిది 163వ ర్యాంక్ గా తప్పుగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.

చివరగా, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ఆర్ధిక అంశాలకు సంబంధించి ఎటువంటి ర్యాంకింగ్స్ ని విడుదల చేయదు.

Share.

About Author

Comments are closed.

scroll