Fake News, Telugu
 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జైపూర్ లోని బ్రిడ్జ్‌కు ఏర్పాటు చేసిన తిరంగా లైటింగ్ దృశ్యాలను హైదరాబాద్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మెట్రో పిల్లర్స్” అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఒక బ్రిడ్జ్‌ను జాతీయ జెండాలోని రంగులని పోలిన లైట్లతో అలంకరించడం చూడవచ్చు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారత స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హైదరాబాద్ మెట్రో బ్రిడ్జ్‌ను తిరంగా లైట్లతో అలంకరించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి చెందినవి. ‘సోడల ఎలివేటెడ్ రోడ్డు’ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగా లైట్లతో ఇలా అలంకరించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ వీడియోలోని గుర్తులను గమనించగా ఎడమవైపు కింద “Saran cliccks” అని ఉంది. ఇదే పేరును సోషల్ మీడియాలో వెతకగా ఈ ఇంస్టాగ్రామ్ అకౌంటు దొరికింది. ఇందులో 04 ఆగస్టు 2022 న “आजादी का अमृत महोत्सव 🇮🇳🇮🇳🇮🇳 जयपुर के नजारे”(ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ .. జైపూర్ దృశ్యాలు) అని చెప్తూ ఒక వీడియో పోస్టు చేశారు.

ఈ వీడియోని వైరల్ అవుతున్న వీడియోతో పోల్చి చూడగా రెండూ ఒక్కటే అని నిర్ధారించవచ్చు. ఈ అకౌంటులో పోస్టు చేసిన ఇంకొక వీడియోలో “Beautiful tricolour lighting at 22godam Bridge Jaipur”  అని ఉంది.

దొరికిన సమాచారంతో ఇంటర్నెట్లో వెతకగా, ఇదే తరహా వీడియోలు చాలా దొరికాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇదే విషయాన్ని “First India News” వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. దానిని ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. సోడల ఎలివేటెడ్ రోడ్డుకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

పై కథనం ప్రకారం, ప్రారంభానికి సిద్ధమవుతున్న ‘sodala elevated road’కి ఒకవైపు 2.8 కిలోమీటర్లు, మరోవైపు 1.8 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ రోడ్డులో లైటింగ్ చేస్తున్నారు. జాతీయ పండుగలు మరియు ఇతర సందర్భాలలో లైటింగ్ సిస్టమ్ విభిన్న థీమ్‌లను కలిగి ఉంటుంది. థీమ్‌లతో, లైట్లు రంగులను మారుతాయి. ప్రతి రోజు థీమ్ భిన్నంగా ఉంటుంది. ఇంతకు ముందు ముంబయి, అమృత్‌సర్, అహ్మదాబాద్ మరియు బెంగుళూరులో కూడా ఇటువంటి లైటింగ్‌లు జరిగాయి, అయితే ఇంత పొడవైన ఎలివేటెడ్ రోడ్‌లో లైటింగ్ చేయడం దేశంలోనే మొదటిసారి. దీనికి సంబంధించిన వీడియోను జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ ట్విట్టర్లో షేర్ చేసింది.

చివరిగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్న ‘సోడల ఎలివేటెడ్ రోడ్డు’ ను తిరంగా  రంగులతో అలంకరించారు. దానికి సంబంధించిన దృశ్యాలను హైదరాబాద్ మెట్రో దృశ్యాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll