Fake News, Telugu
 

నారద స్కాంలో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు తప్పుని ఒప్పుకున్నారన్న వార్తలో నిజం లేదు

0

ఇటీవల నారద స్కాంకి సంబంధించిన కేసులో TMCకి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు నేతలను CBI అరెస్ట్ చేసిన నేపథ్యంలో  ‘నారద స్కాంకి సంబంధించిన కేసులో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు నేరాన్ని ఒప్పుకున్నారు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘నారద స్కాంకి సంబంధించిన కేసులో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు నేరాన్ని ఒప్పుకున్నారు’.

ఫాక్ట్ (నిజం):  నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన కేసులో CBI, 17 మే 2021న నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు TMC నేతలుకాగా, అందులో ఇద్దరు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. ఐతే ఈ విషయానికి సంబంధించి CBI విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో గానీ లేదా వార్తా కథనాలలో గానీ వీరు తప్పును ఒప్పుకున్నట్టు పేర్కొనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 17 మే 2021న విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో ‘నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన కేసులో అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నలుగురు నిందితులను కేంద్ర బ్యూరో అరెస్టు చేసిందని’  మాత్రమే పేర్కొంది. ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా నిందితులు తప్పును ఒప్పుకున్నట్టు CBI పేర్కొనలేదు.

ఈ విషయానికి సంబంధించి అనేక వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి, హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం 17 మే 2021న CBI నారద స్కాం కేసుకి సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఆ నలుగురు TMC నేతలు కాగా అందులో ఇద్దరు ప్రస్తుతం TMC ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అయితే ఈ కథనంలో కూడా ఆ నలుగురు తప్పుని ఒప్పుకున్నట్టు పేర్కొనలేదు, పైగా ఈ కథనంలో అరెస్ట్ అయిన నలుగిరికి స్పెషల్ కోర్ట్ బెయిల్ కూడా మంజూరు చేసినట్టు తెలిపింది. ఐతే ఈ నలుగురి బెయిల్ పై కోల్‌కతా హైకోర్టు స్టే విధించింది. ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఒకవేళ TMC నేతలు తప్పును ఒప్పుకొని ఉంటే వార్తా సంస్థలు ఈ విషయాన్నీ ప్రచురించేవి, CBI కూడా ఆ విషయం తెలిపేది. కానీ, దీనికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక మరే ఇతర సమాచారం లభించలేదు. CBI కూడా 17 మే 2021 తరవాత ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేయలేదు.

చివరగా, నారద స్కాంలో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు తప్పుని ఒప్పుకున్నారన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll