తిరుపతి దేవాలయం నుండి 2,300 కోట్లు ఆంధ్ర ఖజానాకు, సిద్ధి వినాయక దేవాలయం నుండి 600 కోట్లు మహారాష్ట్ర ఖజానాకు బదిలీ చేసారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తిరుపతి దేవాలయం నుండి 2300 కోట్లు ఆంధ్ర ఖజానాకు, సిద్ధి వినాయక దేవాలయం నుండి 600 కోట్లు మహారాష్ట్ర ఖజానాకు బదిలీ చేసారు.
ఫాక్ట్: తిరుపతి దేవాలయం నుండి 2300 కోట్లు ఆంధ్ర ఖజానాకు, సిద్ధి వినాయక దేవాలయం నుండి 600 కోట్లు మహారాష్ట్ర ఖజానాకు బదిలీ చేసారని ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2937.82 కోట్ల (2021-22) టీటీడీ బడ్జెటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 కోట్లు ఇస్తున్నారనే ఉంది. ఇటీవల సిద్ధి వినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్ నుండి 10 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు బొంబాయి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అంత డబ్బు బదిలీ అయినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది గనక జరిగుంటే అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.
తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) ఒక స్వతంత్ర ట్రస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నడుపుతుంది. అయితే, 2937.82 కోట్ల (2021-22) టీటీడీ బడ్జెటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 కోట్లు ఇస్తున్నారనే ఉంది. మానవ వనరుల చెల్లింపులకు (Human Resource Payments) ₹1,308.15 కోట్లు కేటాయింపు, ₹385.60 కోట్ల మెటీరియల్స్ సేకరణ, ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్ ₹250 కోట్లు, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ పనులు ₹180 కోట్లు, కార్పస్ మరియు ఇతర పెట్టుబడులు ₹150 కోట్లు. కాబట్టి, 2300 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారనటంలో అర్ధంలేదు.
ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం, 1987ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) చేసే వార్షిక సహకారం (annual contribution) ఇంతకు ముందు ఉన్న 2.5 కోట్ల నుంచి 50 కోట్లకు పెంచారు.
2020లో ఇటువంటి క్లెయిమ్ ఒకటి బాగా వైరల్ అయినప్పుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాన్ని ఖండించారు. అజిత్ దోవల్ పేరుమీద ట్విట్టర్‌లో నకిలీ అకౌంట్ సృష్టించి 2300 కోట్ల టీటీడీ డబ్బును ట్రెజరీకి బదిలీ చేసారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
సిద్ధి వినాయక దేవాలయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, 600 కోట్లు మహారాష్ట్ర ఖజానాకు బదిలీ చేసారని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. దేవాలయానికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా ఇటువంటి బదిలీ గురించి తెలపలేదు.
ఇటీవల సిద్ధి వినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్ నుండి 10 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు గాను ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం బొంబాయి హై కోర్టులో వేసారని ఆర్టికల్‌లో చూడొచ్చు. 2016లో భారత దేశంలో ఉన్న పది సంపన్న దేవాలయాల గురించి ఇండియా టుడే ఆర్టికల్ రాసింది; అందులో సిద్ధి వినాయక దేవాలయం ఐదవ స్థానంలో ఉంది కానీ దాని వార్షిక ఆదాయం 48 నుంచి 125 కోట్లు ఉండొచ్చని అంచనా.
చివరగా, తిరుపతి దేవాలయం నుండి 2,300 కోట్లు ఆంధ్ర ఖజానాకు, సిద్ధి వినాయక దేవాలయం నుండి 600 కోట్లు మహారాష్ట్ర ఖజానాకు బదిలీ చేసారని ఎటువంటి ఆధారాలు లేవు.