చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాల్చి చంపేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ TeluguSTOP.com అనే ఒక మీడియా సంస్థ పెట్టిన ఆర్టికల్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాల్చి చంపుతున్నారు.
ఫాక్ట్ (నిజం): యివు పోలీసు బ్యూరో ఇచ్చిన వివరణ ప్రకారం పోస్టు లోని వీడియోలో తుపాకులతో ఉన్న పోలీసులు అక్కడ ప్రజలను గాయపరుస్తున్న ఒక పిచ్చి కుక్కను చంపడానికి వెళ్తున్నారని స్పష్టం చేసారు. ఆ వీడియోలో చివరన ఉన్న క్లిప్ ఒక ఆక్సిడెంట్ కి సంబంధించింది. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.
పోస్టు లోని వీడియో లో ఉన్న పోలీస్ వాహనం పైన ఉన్న ‘G1796’ అనే నెంబర్ గూగుల్ లో వెతికితే ‘CGTN ‘ వారు రాసిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించింది. అందులో, యివు పోలీసు బ్యూరో ఆ వీడియో గురించి స్పష్టం చేస్తూ ఇచ్చిన వివరణను చూడవచ్చు. దాని ప్రకారం, ఫిబ్రవరి 1, ఉదయం 11:37 కి యివు పోలీసులకి ఫుటియాన్ అనే ప్రదేశంలో కొంతమందిని గాయపరిచిన ఒక పిచ్చి కుక్క నుండి కాపాడమని అక్కడ ప్రజలు రిపోర్ట్ చేసారని, అందులో భాగంగా పోలీసులు కూడా ఆ కుక్కని కాల్చి చంపారని తెలిసింది. అదే విషయానికి సంబంధించి CGTN చేసిన ట్వీట్ కూడా ఇక్కడ చూడవచ్చు.
పోస్ట్ చేసిన ఆర్టికల్ లోని వీడియోలో, మూడు వేర్వేరు క్లిప్‌లు ఉన్నాయి. అందులోని మొదటి క్లిప్ తమకు సంబంధించినదని, కానీ దాంట్లో ఉన్న ఇతర రెండు క్లిప్‌లు తమకు సంబంధించినవి కావని యివు పోలీసులు చెప్పారు. వీడియోలో రెండవ క్లిప్ గురించి ఏ సమాచారం దొరకకపోయినా, అందులోని మూడవ క్లిప్ చైనాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించింది అని తెలిసింది. ‘CGTN’ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో, వుజు పోలీసు అధికారి, ఆక్సిడెంట్ జరిగిన చోటుని చూపిస్తూ, జనవరి, 29న లియు అనే 15-సంవత్సరాల యువకుడు తన కజిన్ ని బైక్ మీద తీసుకెళ్లేటప్పుడు అతని వాహనం సిమెంటు కర్బ్ లోకి దూసుకుపోయిందని తెలిపాడు. ఆ ఆక్సిడెంట్ కి సంబంధించి డాక్టర్ మరియు లియు యొక్క కజిన్ ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ఆ వీడియోలో చూడవచ్చు. ఇంతకముందు, ‘France 24’ సంస్థ కూడా ఆ ఆక్సిడెంట్ కి సంబంధించిన వీడియోను ఫాక్ట్-చెక్ చేసింది.
చివరగా, అసలు ఏ సంబంధం లేని మూడు వీడియో క్లిప్ లను ఒకే వీడియోలో పెట్టి చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాలుస్తున్నారని తప్పు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?