దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల నేపథ్యంలో ‘రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ప్రజా ఆరోగ్యం, ఆసుపత్రులు మరియు ఔషద శాలలు సంబంధించిన అంశాలు మొదలైనవి స్టేట్ లిస్టులోకి వస్తాయి కాబట్టి, ఈ అంశాలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని’, కాబట్టి కరోనాను ఎదురుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలని కేంద్ర ప్రభుత్వంపై తోసేస్తున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. అయినా కూడా, కరోనాని ఎదురుకోవడంలో రాష్ట్రాలు తమ వైఫల్యాలని కేంద్రంపై తోసేస్తున్నారు.
ఫాక్ట్ (నిజం): రాజ్యగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ప్రజారోగ్య అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం డిసాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ని అమలులోకి తేవడం ద్వారా కరోనా నియంత్రణ కి సంబంధించిన అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాధికారిగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ వచ్చాయి. కాకపోతే ప్రజారోగ్యం అన్నది రాష్ట్రాలకు చెందిన విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుగానే వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయంతో కూడిన బెడ్స్, హాస్పిటల్ లో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్స్ వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీన్నిబట్టి, కరోనా నియంత్రణ వైఫల్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉంది, కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వైఫల్యం చెందాయి అనడంలో అర్ధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఏం చెప్తుంది:
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనకు సంబంధించిన ప్రస్తావన ఉంది. ఈ షెడ్యూల్ లో ఆర్టికల్ 246 కింద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మరియు కాంకరెంట్ లిస్ట్ అనే మూడు లిస్టుల ఆధారంగా వివిధ అంశాలపై అధికారాలను రాష్ట్రాలకు మరియు కేంద్రానికి పంచారు. ప్రస్తుతానికి యూనియన్ లిస్టులో 100 అంశాలున్నాయి. ఈ అంశాలపై చట్టాలు చేసే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉంది. అలాగే స్టేట్ లిస్టులో ప్రస్తుతం 66 అంశాలున్నాయి. అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ లో ప్రస్తుతం 52 అంశాలున్నాయి.
సాధారణంగా స్టేట్ లిస్టులోని అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా స్టేట్ లిస్టులో ఉన్న అంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాగం ఆర్టికల్ 249 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
పార్లమెంట్ స్టేట్ లిస్టులోని అంశాలపై మూడు సందర్భాలలో చట్టాలను రూపొందించగలదు.
- స్టేట్ లిస్టులోని అంశంపై పార్లమెంట్ చట్టం చేయాలని రాజ్యసభ తీర్మానించినప్పుడు.
- జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్న సమయంలో.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపై చట్టం చేయాలని పార్లమెంటును కోరుతూ తీర్మానం చేసినప్పుడు. ఇలా చేసిన చట్టం ఆయా కోరిన రాష్ట్రలకే వర్తిస్తుంది.
పోస్టులో చెప్తున్నట్టు ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు నిజంగానే స్టేట్ లిస్టులోనే ఉన్నాయి. ఈ అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థకి సంబంధించిన భాద్యత కూడా రాష్ట్రాలదే. ఐతే కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా వరకు అంశాలలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాదికారిగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కింద చూద్దాం.
కోవిడ్-19ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్చ్ 2020లో డిసాస్టర్ మ్యానేజ్మెంట్ ఆక్ట్ ని అమలులోకి తేవడం ద్వారా మొత్తం దేశంలో లాక్ డౌన్ విధించింది. ఈ ఆక్ట్ ద్వారా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలును కచ్చితంగా అమలు చేయాలి. తిరిగి విడతల వారిగా చేసిన ‘అన్లాక్’ ప్రక్రియలో కూడా ఎప్పుడు ఏయే రంగాలకి వెసలుబాటు కల్పించాలో కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది.
కోవిడ్-19 ని ఎదురుకొనే విషయంలో మొదటినుండి నిర్ణయాదికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంది. రాష్ట్రాలు కేవలం కేంద్ర ప్రభుత్వ సూచనలు మాత్రమే పాటిస్తూ వస్తున్నాయి. కరోనా సోకిన వారికి ఎలాంటి వైద్యం అందించాలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థలే నిర్ణయించాయి. PEE కిట్స్ తో మొదలుపెట్టి టెస్టింగ్ కిట్స్, కోవిడ్ వాక్సిన్, మెడికల్ ఆక్సిజన్ వరకు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు వాటాలు కేటాయిస్తూ వచ్చింది. వాక్సినేషన్ పాలసీ ( ఏ వయసు లోపు వారికీ వాక్సిన్ ఇవ్వాలో, ఏ రంగాల్లో వారికి వాక్సిన్ ఇవ్వాలో) నిర్ణయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వమే వాక్సిన్ తయారీ కంపెనీల దగ్గరి నుండి వాక్సిన్స్ కొన్ని రాష్ట్రాలకు పంచుతూ వచ్చింది. రాష్ట్రాలకు నేరుగా కంపెనీల వద్ద నుండి వాక్సిన్స్ ని కొనడంగాని లేదా ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకొనే అధికారం ఇంతకు ముందు వరకూ లేదు. 19 ఏప్రిల్ 2021 రోజున తీసుకున్న నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా వాక్సిన్ తయారు చేసే సంస్థల నుండి కొనుగోలు చేసే అధికారాన్ని కేంద్రం ఇచ్చింది.
ఇటీవల పిఎం కేర్స్ ఫండ్స్ నుండి వివిధ రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించడానికి కేటాయించిన డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కాకుండా కేంద్ర అర్రోగ్య మంత్రిత్వ శాఖకి చెందిన సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్ అనే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థకు కేంద్రం ఇచ్చింది. రాష్ట్రాలు కేవలం ఎక్కడ ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలో చెప్పి, నిర్మాణానికి అవసరమైన అనుమతులు మరియు నిర్మాణ అనంతరం ఆ ప్లాంట్ నిర్వహణ చూసుకోవాలి. నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థదే.
ఐతే కోవిడ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించినప్పటికీ, ప్రజారోగ్యమనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం రాష్ట్రాల భాద్యతే. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయంతో కూడిన బెడ్స్, హాస్పిటల్ లో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్స్ వంటి మౌలిక సదుపాయాలు ముందుగానే సమకుర్చుకొనే అవకాశం రాష్ట్రాలకు ఉన్నా కూడా, చాలావరకు రాష్ట్రాలు ఇలాంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు చాలా వరకు రాష్ట్రాలలో వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. గమనించవలసిన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని వార్షిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి కేటాయిస్తుంది చాలా తక్కువే.
క్లుప్తంగా చెప్పాలంటే ప్రజా ఆరోగ్య వ్యవస్థ అనేది రాష్ట్ర పరిదిలోకి వస్తుంది కాబట్టి మెరుగైన వైద్య సదుపాయాలు ఇప్పటికే సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనప్పటికి, కరోనా విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వమే మొదటి నుండీ నిర్ణయాధికారిగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ఆదేశాలు అమలు చేస్తూ వచ్చాయి. కాబట్టి కరోనాని నియంత్రించడంలో జరిగిన లోపాలకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత తీసుకోవాలి. కానీ, ఈ వైఫల్యాన్ని కేవలం రాష్ట్రలపైకి తోసేయడంలో అర్ధం లేదు.
చివరగా, ప్రజారోగ్యమనేది రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికి, కరోనా నియంత్రణలో మొదటినుండి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాధికారిగా వ్యవహరించింది.