Deepfake, Fake News, Telugu
 

ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తున్నట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ‘Sora’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. వీడియోను @dark.wab48 అనే క్రియేటర్ రూపొందించి TikTokలో అప్లోడ్ చేశాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, వీడియోలో ‘Sora’ అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్‌ ఈ వైరల్ వీడియోను OpenAI వారి ‘Sora’ AI మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ఈ వీడియోలో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోలో, ఆ వ్యక్తి ఒక చేత్తో బిర్యానీ గిన్నెను ఎత్తడం కనిపిస్తుంది, ఇది సహజంగా సాధ్యమయ్యే పని కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో మనం సహజంగానే ఇటువంటి లోపాలను చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ).

ఈ వీడియో చివరిలో ‘@dark.wab48’ అనే వాటర్‌మార్క్‌ను మేము గమనించాము. ఇంటర్నెట్‌లో అతని పేరు వెతికితే, ఇదే వీడియో @dark.wab48 TikTok హ్యాండిల్‌లో లభించింది, వీడియో వివరణలో అతను ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పేర్కొన్నాడు.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.9% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరిగా, ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll