Fake News, Telugu
 

ఈ వీడియోలో భారత జాతీయ జెండాను అవమానిస్తున్నది అమెరికాలోని ఖలిస్తాన్ నిరసనకారులు, భారతీయ రైతు ఉద్యమకారులు కాదు

0

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రైతు నిరసనకారులు భారత జాతీయ జెండాను అవమానిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని నిరసన చేస్తున్న సిక్కు ఉద్యమకారులు, భారత జాతీయ జెండాని చింపివేస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతు నిరసనకారులు భారత జాతీయ జెండాను అవమానిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో, ఖలిస్తాన్ మద్దతుదారులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అమెరికాలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతు సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమానికి తమ మద్దతు పలుకుతూ ఖలిస్తాన్ మద్దతుదారులు ఐక్యరాజ్యసమితి ఎదుట 25 సెప్టెంబర్ 2021 నాడు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వీడియోలో భారత జాతీయ జెండాను అవమానిస్తున్నది భారతీయ రైతు నిరసనకారులు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NRI Herald’ అనే న్యూస్ పోర్టల్ తమ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఖలిస్తానీ సిక్కు మద్దతుదారులు న్యూయార్క్‌లో భారత జెండాను చింపివేస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి మరింత సమాచారం కోసం వెతకగా, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ఎదుట నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులు ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమం యొక్క లైవ్ వీడియో దొరికింది. పోస్టులోని వీడియోలో జాతీయ జెండాను చింపివేస్తున్న ఆ ఇద్దరు సిక్కు వ్యక్తులు, ఈ లైవ్ వీడియోలో అవే దుస్తులతో కనిపిస్తారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఖలిస్తాన్ మద్దతుదారులు 25 సెప్టెంబర్ 2021 నాడు ఐక్యరాజ్యసమితి ఎదుట నిరసన చేపట్టారు. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సెప్టెంబర్ 2021 నాడు ప్రసంగించినున్న నేపథ్యంలో, వారు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో కనిపిస్తున్న ఆ ఇద్దరు సిక్కు నిరసనకారులు ఈ ఆర్టికల్స్‌లోని ఫోటోలలో కనిపిస్తుండటాన్ని బట్టి ఈ వీడియోలో భారత జాతీయ జెండాను అవమానిస్తున్నది అమెరికాలోని ఖలిస్తాన్ మద్దతుదారులని స్పష్టమయ్యింది.

చివరగా, ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికాలో నిర్వహించిన నిరసన వీడియోని భారతీయ రైతు ఉద్యమకారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ జెండాను అవమానిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll