Fake News, Telugu
 

ఈ వీడియో 2016లో ఇరాక్‌లో ISIS వ్యతిరేక కుర్దిష్ దళాల కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో ISIS ఉగ్రవాదులు ఇరాకీ పౌరులను చంపిన దృశ్యాలను చూపిస్తుంది

0

ఇటీవల 09 ఆగస్ట్ 2024న కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా నిరసనలు (ఇక్కడ, ఇక్కడ) జరుగుతున్న నేపథ్యంలో, “సౌదీ అరేబియాలో  ఏడుగురు పాకిస్థానీయులు ఒక 16 ఏళ్ళ అమ్మాయిని బలాత్కారం(అత్యాచారం) చేసి, తదుపరి చంపడం జరిగింది. అక్కడి పోలీసులు నిందుతలను బంధించి, చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. అక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, వారందరికి శిరచ్ఛేదం (తలలను నరకడం) చేయమని మరియు ప్రజలందరూ అది చూసేలా వీడియో తీయమని ఆదేశించడం జరిగింది” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటిదే మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సౌదీ అరేబియాలో 16 ఏళ్ల బాలికపై ఏడుగురు పాకిస్థానీలు అత్యాచారం చేసి చంపగా, సౌదీ అరేబియా చట్టాల ప్రకారం అక్కడి పోలీసులు వారి తలలు నరికి చంపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.  

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2016లో ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఇరాకీ కుర్దిష్ పెష్మెర్గా దళాల కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో ISIS ఉగ్రవాదులు ఇరాకీ పౌరులను శిరచ్ఛేదం(తలలను నరకడం) చేసి చంపిన దృశ్యాలను చూపిస్తుంది. సౌదీ  అరేబియాలో గతంలో అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయడం లేదా శిరచ్ఛేదం చేసినట్లు పలు రిపోర్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి శిక్షలు బహిరంగగా  జరుగుతున్నట్లు  ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అయితే, సౌదీ అరేబియాలో, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని  ఇంకా శిరచ్ఛేదం (కత్తితో తలలను నరకడం) చేసి చంపుతున్నట్లు పలు రిపోర్టులు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కీఫ్రేములతో కూడిన వార్తాకథనం ఒకటి 20 సెప్టెంబర్ 2016న మిడిల్ ఈస్ట్ మీడియా 24( ఆర్కైవ్ ) అనే వెబ్‌సైట్ పబ్లిష్ చేసినట్లు తెలిసింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియోని ISIS సంస్థ 19 సెప్టెంబర్ 2016న విడుదల చేసింది. ఈ వీడియో ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో కుర్దిష్ పెష్మెర్గా దళాల కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో 16 మంది ఇరాకీలను ISIS ఉగ్రవాదులు దారుణంగా తలలు నరికి హత్య చేసిన దృశ్యాలను చూపిస్తున్నది. ISIS (ఐసిస్) చేతిలో హత్యకు గురైన యువకులు వారు ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో “ఉమ్ అల్ – రబిన్” బెటాలియన్ పేరుతో రహస్యంగా పనిచేస్తున్న ఐసిస్ వ్యతిరేక దళానికి చెందిన వారని అంగీకరించినట్లుగా ఐసిస్ వీడియోతో పాటు జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నట్లు ఈ వార్త కథనం పేర్కొంది.

వైరల్ వీడియోలోని కీఫ్రేములను పబ్లిష్ చేస్తూ ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. గతంలో ISIS ఇదే  విధంగా అనేక మందిని చంపింది, అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న కొన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.  వైరల్ వీడియోలోని కీఫ్రేములను, ఈ వార్త కథనాలలో ఫోటోలతో పోల్చి చూస్తే,  వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇదే ఘటనకు సంబంధించవిగా మనం నిర్ధారించవచ్చు.

ఇకపోతే సౌదీ అరేబియాలో రేప్(అత్యాచారం) చేస్తే శిక్షలు చాలా కఠినంగానే ఉంటాయి. సౌదీ అరేబియా యొక్క షరియా చట్టం ప్రకారం అత్యాచారం ఒక క్రిమినల్ నేరం, దీనికి కొరడాలతో కొట్టడం, ఉరితీయడం వంటి అనేక శిక్షలు వేయడం జరుగుతుంది. గతంలో అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయడం లేదా శిరచ్ఛేదం (తలలను నరకడం) చేశారని పలు రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది (ఇక్కడ, ఇక్కడ) . కానీ ఇప్పుడు అలాంటివి బహిరంగగా చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అయితే, సౌదీ అరేబియాలో, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని శిరచ్ఛేదం (కత్తితో తలలను నరకడం) చేసి చంపుతున్నట్లు పలు రిపోర్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) పేర్కొన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం 2018లో సౌదీ అరేబియా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి, ఆమె టీనేజీ కుమారుడిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు పాకిస్తానీ పౌరులను శిరచ్ఛేదం (కత్తితో తలలను నరకడం) చేసినట్లు తెలిసింది.

చివరగా, 2016లో ఇరాక్‌లోని మోసుల్‌లో ISIS వ్యతిరేకఇరాకీ కుర్దిష్ పెష్మెర్గా దళాల కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో ISIS ఉగ్రవాదులు ఇరాకీ పౌరులను శిరచ్ఛేదం (తలలను నరకడం) చేసి చంపిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll