అప్డేట్ (29 మార్చ్ 2022):
ఇంతకుముందు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని మేఘాలు తాకకుండా వెళుతున్న దృశ్యాలంటూ షేర్ చేసిన వీడియోని ఇప్పుడు ‘కైలాస పర్వతం గుండా మేఘాలు వెళ్లవు’ అని షేర్ చేస్తున్నారు. కానీ, క్రింద వివరించినట్టు ఈ వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించారు.
మేఘాలు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని తాకకుండా వెళుతున్న అధ్బుత దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. మౌంట్ ఫుజి పర్వతాన్ని మేఘాలు ఎన్నటికి తాకవని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మేఘాలు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని తాకకుండా వెళుతున్న అధ్బుత దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించారు. ఫోటోగ్రాఫర్ ఎల్వినార్డి డార్విన్ తీసిన మౌంట్ ఫుజి పర్వతం ఫోటోకి గ్రాఫిక్స్ జత చేస్తూ ‘Endless Motion’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వారు ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Vacay Store’ అనే e-కామర్స్ వెబ్సైటు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ‘Vacay Store’ ఈ వీడియో క్రెడిట్స్‌ని ‘vinoverdrive’ మరియు ‘Endless Motion’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలకి ఇచ్చింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ‘vinoverdrive’ ఇన్‌స్టాగ్రామ్ పేజిలో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ 11 మర్చి 2016 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని ఎల్వినార్డి డార్విన్ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్టు తెలిసింది.
ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం ‘Endless Motion’ ఇన్‌స్టాగ్రామ్ పేజిలో వెతికితే, పోస్టులో షేర్ చేసిన అదే వీడియోని ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజి 09 జూన్ 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘Parked on a cloud above Fuji Mountain, Japan’,అనే టైటిల్‌తో ఈ వీడియోని ‘Endless Motion’ ఇన్‌స్టాగ్రామ్ పేజీ పబ్లిష్ చేసింది. ఈ వీడియోని ఎల్వినార్డి డార్విన్ తీసిన ఫోటోకి డిజిటల్ గ్రాఫిక్స్ జత చేసి రూపొందించినట్టు వివరణలో తెలిపారు. ఈ వీడియో 2018లో వైరల్ అయినప్పుడు, ‘Endless Motion’ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, వైరల్ అవుతున్న ఈ వీడియోని తామే రూపొందించామని స్పష్టం చేస్తూ మళ్ళీ వాటర్‌మర్కుతో ఉన్న వీడియోని షేర్ చేసింది. డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించిన చాలా వీడియోలని ‘Endless Motion’తమ ఇన్‌స్టాగ్రామ్ పేజిలో మనం చూడవచ్చు.
జపాన్‌లోని ఫుజి పర్వతంపై మేఘాలు వెళుతున్న దృశ్యాలని పలు న్యూస్ సంస్థలు తమ ఆర్టికల్స్ మరియు వీడియోలలో చూపించారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించిన వీడియోని మేఘాలు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని తాకకుండా వెళుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.