సామాజిక దూరం పాటించకుండా ఒక మార్కెట్ ప్రాంతం ఎక్కువ జనాలతో రద్దీగా ఉన్న వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియో ఢిల్లీలోని జఫ్ఫ్రాబాద్ ప్రాంతంలోని ప్రస్తుత దృశ్యాలను చూపిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీలోని జఫ్ఫ్రాబాద్ ప్రాంతంలో సామాజిక దూరం పాటించకుండా జనాలతో రద్దీగా ఉన్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఇదే వీడియోని ఏప్రిల్ 2021లో చాలా పాకిస్తాన్ లోకల్ న్యూస్ ఏజెన్సీస్ తమ ఫేస్ బుక్ అకౌంట్స్ లో షేర్ చేసాయి. లాహోర్ లోని ఇచ్చార్ బజార్ లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఈద్ షాపింగ్ చేస్తున్నారన్న వివరణతో ఈ వీడియోని షేర్ చేసారు. ఇచ్చార్ బజార్ లో స్థానికులు COVID-19 నిబంధనలను ఉల్లంఘించినందున అధికారులు అనేక దుకాణాలను మూసివేసినట్లు పాకిస్తాన్ వార్తా కథనాలు మరియు లోకల్ న్యూస్ ఏజెన్సీలు కథనాలు ప్రచురించాయి. ప్రస్తుతం ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఒకవేళ ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు విస్మరించి ఇలా గుమిగూడి ఉంటే వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి, కాని మాకు ఢిల్లీకి సంబంధించి ఇటువంటి రిపోర్ట్స్ ఏవి లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలో షాప్స్ కి సంబంధించిన సైన్ బోర్డ్స్ ఉర్దూలో రాసి ఉండడం గమనించొచ్చు. దీని ఆధారంగా ఫేస్ బుక్ లో కీవర్డ్స్ తో వెతకగా ఇదే వీడియోని చాలా పాకిస్తాన్ లోకల్ న్యూస్ అకౌంట్స్ ఏప్రిల్ 2021లో షేర్ చేసిన పోస్టులు మాకు కనిపించాయి. ఈ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ పోస్టుల ప్రకారం ఈ వీడియో పాకిస్తాన్ లోని లాహోర్ రాష్ట్రంలోని ఇచ్చార్ బజార్ లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఈద్ షాపింగ్ చేస్తున్న సందర్భానిది.
పైన తెలిపిన ఫేస్ బుక్ పోస్టుల ఆధారంగా యూట్యూబ్ లో వెతకగా ఇదే వీడియోని ఒక లోకల్ న్యూస్ ఏజెన్సీ తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఈ ఛానల్ లో ఈ వీడియోకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం ఇది లాహోర్ లోని ఇచ్చార్ బజార్ లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఈద్ షాపింగ్ చేస్తున్న సందర్భానిదని ద్రువీకరిస్తుంది.
మరొక లోకల్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇచ్చార్ బజార్ లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా షాపింగ్ చేస్తున్న ఘటనని రిపోర్ట్ చేసిన వీడియో మాకు కనిపించింది. పాకిస్తాన్ వార్తా కథనాల ప్రకారం ఇచ్చార్ బజార్‌లో స్థానికులు COVID-19 నిబంధనలను ఉల్లంఘించినందున అధికారులు అనేక దుకాణాలను మూసివేసినట్లు పేర్కొంది.
వీటన్నిటి బట్టి పోస్టులోని వీడియో లాహోర్ కి సంబంధించిందని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఒకవేళ ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు విస్మరించి ఇలా గుమిగూడి ఉంటే వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి. కాని మాకు ఢిల్లీకి సంబంధించి ఇటువంటి రిపోర్ట్స్ ఏవి లభించలేదు.
చివరగా, ప్రజలు సామాజిక దూరం పాటించకుండా షాపింగ్ చేస్తున్న ఈ వీడియో పాకిస్తాన్ లోని లాహోర్ కి సంబంధించింది, ఢిల్లీకి సంబంధించింది కాదు.