Fake News, Telugu
 

ముస్లిం వ్యక్తులు డబ్బును సంచులలో మోసుకెల్తున్న ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఒక మసీదుకు సంబంధించింది

0

మన దేశంలో మసీదుల్లో వచ్చే డబ్బుపై పన్ను లేదు కానీ, గుడి ద్వారా వచ్చే డబ్బుకు మాత్రమే పన్ను విధిస్తారు అని చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతోంది. తమ వాదనకు మద్దతుగా కొందరు ముస్లిం వ్యక్తులు డబ్బును సంచులలో తరలిస్తున్న వీడియో ఒకటి ఈ పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం వ్యక్తులు డబ్బును సంచులలో తరలిస్తున్న వీడియో; మన దేశంలో మసీదుల్లో వచ్చే డబ్బుపై పన్ను లేదు కాని, గుడి ద్వారా వచ్చే డబ్బుకు మాత్రమే పన్ను విధిస్తున్నారు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించింది. ఈ దృశ్యాలు గత నెల ఈ మసీదుకు సంబంధించిన విరాళాలను లెక్కించే క్రమంలో బాక్స్‌లను తెరిచినప్పుడు తీసినవి. ఇకపోతే మన దేశంలో అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం ఏ మతానికి చెందిన ట్రస్టుకైనా ఒకే పన్ను విధానం అమలవుతుంది. పన్ను మినహాయింపులు కూడా అన్నీ మతపరమైన ప్రదేశాలకు ఒకేలా వర్తిస్తాయి. వ్యక్తిగతంగా  కూడా ఒక వ్యక్తి/సంస్థ ఏదైనా మత సంస్థ/ట్రస్ట్‌కు చేసే విరాళాలకు కూడా పన్ను అమలు/మినహాయింపు ఒకేలా వర్తిస్తాయి. ఐతే ప్రభుత్వ ఆదీనంలో దేవాలయాలు మాత్రం (ఎండోమెంట్స్ శాఖ కిందివి) తమ ఆదాయం నుండి కొంత భాగం ప్రభుత్వాలకు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ పన్నులు ఆలయాల నిర్వహణకు నిధులు కేటాయిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ పోస్టులో తమ వాదనకు మద్దతుగా షేర్ చేసిన వీడియో మన దేశానికి సంబంధించింది కాదు. ఎందుకంటే వీడియోలో కనిపిస్తున్న కరెన్సీ నోట్లు మన దేశానికి సంబంధించినవి కావు. ఇవి బంగ్లాదేశీ కరెన్సీ నోట్లు, ఆ నోట్లపై బంగ్లాదేశ్ స్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే డబ్బులను తరలిస్తున్న సంచులపై రాతలు బంగ్లాలో ఉన్నాయి.

వీటి ఆధారంగా ఇంటర్నెట్‌లో వెతకగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన బంగ్లాదేశ్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ దృశ్యాలు బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించినవి. గత నెల ఈ మసీదుకు సంబంధించిన విరాళాలను లెక్కించే క్రమంలో బాక్స్‌లను తెరిచారు, వైరల్ అవుతున్న దృశ్యాలు ఆ సందర్భంలో తీసినవే.

పైగా గతంలో ఈ మసీదు విరాళాల బాక్స్‌లను తెరిచిన ఇలాంటి వీడియోలే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియోకు మన దేశానికి సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

మన దేశంలో అన్ని మతాల ట్రస్ట్‌లకు టాక్స్ వర్తిస్తుంది:

సాధారణంగా మతపరమైన ప్రదేశాలు (గుడి, మసీదు, మదర్సా) కార్యనిర్వహణ వ్యవహారాలు ట్రస్ట్‌ల ద్వారా నిర్వహిస్తుంటారు. ప్రజలకు సేవలు (ప్రసాదాలు, వసతి గృహాలు, మొదలైనవి) అందించి, వాటిపై ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఇవి కాకుండా విరాళాల రూపంలో కూడా ఆదాయం వస్తుంటుంది.

ఐతే గుడి/చర్చి/మసీదు ఏదైనా ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ అయ్యుంటే, అప్పుడు ఇవి అందించే పలు సేవలపై GST వర్తిస్తుంది. కాగా కొన్ని సేవలకు మాత్రం టాక్స్ మినహాయింపు ఉంది. ఐతే టాక్స్ మినహాయింపు పొందడానికి ముందుగా ఇవి రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి పైన చెప్పినట్టు ఏ మత ప్రదేశమైన (గుడి, మసీదు, మదర్సా, చర్చ్) దేశంలోని చట్టాలకు లోబడి పన్నులు కట్టాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ మతపరమైన ప్రదేశాలు విరాళాల రూపంలో పొందే ఆదాయానికి మాత్రం GST వర్తించదు. ఐతే ఈ టాక్స్ నియమాలు అన్నీ మతాలకు వర్తిస్తాయి. కాబట్టి కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నారు.

వ్యక్తిగతంగా కూడా ఎవరైనా వ్యక్తి/సంస్థ ఒక మతపరమైన ట్రస్ట్‌లకు అందించే విరాళాలకు సంబంధించి కూడా సెక్షన్ 80G కింద టాక్స్ మినహాయింపుకు అవకాశం ఉంది. ఐతే వీటికి కూడా షరతులు వర్తిస్తాయి. షరతులకు లోబడిన విరాళాలకే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐతే అన్నీ మతాలకు ఇదే వర్తిస్తుంది.

ప్రభుత్వ ఆదీనంలో హిందూ దేవాలయాల సంగతి ఏమిటి?

ఇవి కాకుండా దేశంలో చాలావరకు హిందూ దేవాలయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో నడుస్తున్నాయి (ఎండోమెంట్స్ శాఖ కింద). రాష్ట్రాలు వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ చట్టాలను రూపొందించి వీటి పరిపాలనను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టాల ద్వారా ఆలయాల భూములు, ఇతర ఆస్తులను తమ పర్యవేక్షణలోకి తెచ్చుకున్నాయి.

అలాగే  రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల ద్వారా దేవాలయాల ఆదాయంలో కొంత భాగాన్ని తీసుకుంటున్నాయి. కాగా ఆలయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నాయి (జీతాలు, నిర్వహణ ఖర్చులు, మొదలైనవి). 

ఉదాహారణకి Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act, 1987 చట్టం ద్వారా రాష్ట్రంలోని దేవాలయాలను పర్యవేక్షిస్తుంది. ఈ చట్టంలోని నిబంధన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి తమ హుండీ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది.

ఐతే 2021లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తమ హుండీ ఆదాయంలో ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 50 కోట్లు చెల్లించేలా నిబంధనల సవరణ చేసింది. దీన్నిబట్టి, ప్రభుత్వాలు తమ ఆధీనంలోని దేవాలయాల ఆదాయంలో కొంత భాగాన్ని తీసుకుంటున్నాయని స్పష్టమవుతుంది.

ఈ వార్త 2017 నుండి వైరల్ అవుతుంది:

ఇలా ప్రభుత్వం కేవలం హిందూ దేవలయాల ఆదాయంపైనే పన్నులు విధిస్తుందని, మసీదుల ఆదాయంపైన ఎటువంటి పన్ను ఉండటం లేదన్న వార్త 2017లో కేంద్ర ప్రభుత్వం GSTను ప్రవేశపెట్టినప్పటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐతే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మరియు ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ వార్తలను ఖండించింది.

చివరగా, ముస్లిం వ్యక్తులు డబ్బులను సంచులలో మోసుకేల్తున్న ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఒక మసీదుకు సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll