Fake News, Telugu
 

వై.ఎస్.జగన్‌ని రోజా విమర్శిస్తున్నారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది

0

వై.ఎస్.జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి రాజధాని లేకుండా అప్పుల పాలు చేసి సర్వనాశనం చేశారని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఆయన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, వై.కా.పా నేత రోజా చెప్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.   

క్లెయిమ్: వై.ఎస్.జగన్‌ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి రోజా చెప్తున్న వీడియో.

ఫాక్ట్: పూర్తి వీడియో పరిశీలించగా ఆమె ఈ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ అన్నట్లుగా స్పష్టమవుతుంది. వీడియోని ఎడిట్ చేసి ఆమె వై.ఎస్.జగన్‌ని విమర్శిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది. కాబట్టి పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీనికి సంబంధించిన పూర్తి వీడియో 29 ఏప్రిల్ 2023లో సాక్షి టీవీ యూట్యూబ్ చానెల్లో ప్రసారం చేసినట్లు గుర్తించాం.

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో నటుడు రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన సందర్భంలో మంత్రి రోజా దాన్ని ఖండిస్తూ ఈ విధంగా అన్నారు, “…ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తే 2024లో మొదటిసారి ముఖ్యమంత్రి అవుతాడు అని కాదు. ఇదివరకే మూడు సార్లు అయ్యాడు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ముక్కలు చెక్కలు చేసి, అప్పుల పాలు చేసి, ఏరోజు రాజధాని లేకుండా ఉంది అంటే ఆయన చేసిన పని వల్లనే, కాబట్టి ఏరోజు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు…” అని అన్నారు. ఆమె ఈ వీడియోలో ఎక్కడా కూడా జగన్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు.

చివరిగా, చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ రోజా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వై.ఎస్.జగన్‌ని ఆమె విమర్శిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll