భారీ లోడ్ తో వెళ్తున్న ఒక లారీ ఆంధ్రప్రదేశ్ లోని రోడ్డు పై బోల్తా కొట్టిన దృశ్యం, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామర్లకోట నుండి పిఠాపురం వెళ్ళే రోడ్డు పై ఈ ప్రమాదం జరిగిందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని రోడ్డు పై లారీ బోల్తా కొట్టిన దృశ్యం.
ఫాక్ట్ (నిజం): ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ బైపాస్ రోడ్డు పై చోటు చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘TV9 Telugu’ న్యూస్ ఛానల్ ‘09 అక్టోబర్ 2020’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ బైపాస్ రోడ్డు పై చోటు చేసుకుంది అని వీడియోలో పేర్కొన్నారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీ, గుంటలు పడివున్న మల్కాపూర్ బైపాస్ రోడ్డు పై బోల్తా కొట్టినట్టు వీడియోలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా కరీంనగర్ లోని మల్కాపూర్ బైపాస్ రోడ్డు అధ్వానంగా మారినట్టు అందులో తెలిపారు. ఈ సంఘటనకి సంబంధించి ‘hmtv News’ న్యూస్ ఛానల్ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, వీడియోలో కనిపిస్తున్న లారీ బోల్తాపడింది తెలంగాణలోని మల్కాపూర్ బైపాస్ రోడ్డు పై, అంధ్రప్రదేశ్ లోని రోడ్డు పై కాదు.