డాక్టర్లు సర్జరీ ద్వారా కడుపులో నుండి గడ్డి లాంటి పదార్థాలను తొలగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. సౌదీ అరేబియాలో ఓ ఆరేళ్ల చిన్నారి కడుపులో నుండి దీనిని తొలగించారని, జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులోని పేగుల్లో ఇలా చెత్త తయారైందని, అందరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: జంక్ ఫుడ్ తినడం వల్ల ఓ ఆరేళ్ల చిన్నారి కడుపులో పేరుకుపోయిన గడ్డిలాంటి పదార్థాలను డాక్టర్లు ఆపరేషన్ ద్వారా తొలగిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2020లో సుడాన్‌లో రిపోర్ట్ అయ్యింది. ‘పికా సిండ్రోమ్’ అనే కండిషన్‌తో బాధపడుతున్న ఒక అమ్మాయి తరచూ గడ్డి తినడంతో ఇలా కడుపులోని పేగుల్లో గడ్డి పేరుకుపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఈ గడ్డిని తొలగించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డాక్టర్లు ఆపరేషన్ ద్వారా పేగుల్లో పేరుకుపోయిన గడ్డిలాంటి పదార్థాలను తొలిగిస్తున్న విషయం నిజమే అయినప్పటికీ, ఇది జంక్ ఫుడ్ తిన్నందుకు పేరుకుపోయిన చెత్త కాదు, పైగా ఈ ఘటన సౌదీ అరేబియాలో జరగలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోను స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 2020లో రిపోర్ట్ చేసిన పలు మిడిల్ ఈస్ట్ వార్తా కథనాలు మాకు కనిపించాయి.
ఈ కథనాల ప్రకారం ఈ ఘటన సుడాన్‌లో రిపోర్ట్ అయ్యింది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక అమ్మాయి జీర్ణాశయంలో పేరుకుపోయిన గడ్డిని తొలగించారు. ఐతే ఆ అమ్మాయి తరచూ గడ్డి తినడం వల్ల ఆమె పేగుల్లో ఇలా పేరుకు పోయిందని డాక్టర్లు తెలిపారు. ఆ అమ్మాయి ‘పికా సిండ్రోమ్’ అనే ఒక కండిషన్‌తో బాధపడుతుందని, ఈ సమస్య ఉన్నవారికి సబ్బులు, జుట్టు, గడ్డి, మట్టి, ఇసుక, సుద్ద మొదలైన పదార్థాలను తినాలనే బలమైన కోరిక కలుగుతుందని డాక్టర్లు తెలిపారు.
పైన చెప్పిన విషయాలనే ధృవీకరిస్తూ ఈ వీడియోను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల బట్టి ఈ వీడియోకు జంక్ ఫుడ్ తినడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని ఉన్న విషయం నిజమే అయినప్పటికీ, పిల్లలు ఎక్కువ తినకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియోను షేర్ చేసిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వీడియోలో దృశ్యాలు జనాలను భయాందోళనలకు గురిచేసి అవాకాశం ఉంది.
చివరగా, తరచూ గడ్డి తినడంతో పేగుల్లో పేరుకుపోయిన గడ్డిని డాక్టర్లు తొలగించిన ఘటనకు సంబంధించింది ఈ వీడియో.