Fake News, Telugu
 

ఈ వీడియో కర్ణాటకలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన బక్రీద్ వేడుకలది, ప్రభుత్వ పాఠశాలలో కాదు

0

ఒక స్కూల్‌లో బక్రీద్ వేడుకల సందర్భంగా తీసినదిగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఖురాన్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి పంచి, వారికి దాన్ని బోధించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించినట్లు ఈ వీడియోను షేర్ చేస్తూ యూసర్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క  వాస్తవికతని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: కర్ణాటక ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఖురాన్‌ను సరఫరా చేసి వారికి ఖురాన్ బోధించాలని నిర్ణయం తీసుకుంది.

 నిజం(ఫాక్ట్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖురాన్‌ను పంపిణీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలో ఖురాన్‌ బోధిస్తున్నట్లు కానీ ఎటువంటి సమాచారం/ఆధారం లేదు. అంతేకాకుండా, వైరల్ వీడియో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని చన్నరాయపట్నంలో ఉన్న  జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో బక్రీద్ వేడుకలకు సంబంధించింది, ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ప్రతి పండుగకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

ముందుగా, కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని హిందూ విద్యార్థులకు ఖురాన్ పంపిణీకి చేసి, విద్యార్థులకి దాన్ని బోధించటానికి ఏదైనా నిర్ణయం తీస్కోందా అని తెలుసుకోవటానికి, మేము ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ విషయాన్నీ ధృవీకరించే ఎటువంటి విశ్వసనీయ సమాచారం కూడా  మాకు లభించలేదు.

తర్వాత, వీడియోలోని బ్యానర్‌పై ఉన్న పాఠశాల పేరు (జ్ఞానసాగర)ను గమనించిన ఇంటర్నెట్లో ఈ వీడియో గురించి వెతకగా, 1 జూలై 2023న అనేక మీడియా సంస్థలు ఈ విషయంపై రాసిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కథనాల ప్రకారం, ఈ పాఠశాలలో పిల్లల చేత ఇస్లామిక్ ప్రార్థనలు బలవంతంగా పఠించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కొందరు హిందూ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఇది వివాదాస్పదమైంది.

తరువాత, పాఠశాల యాజమాన్యం దీనిపై ఒక వివరణ ఇచ్చింది ‘మేము (వారు) విద్యార్థులలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి మాత్రమే ఇలా చేసాము’ అని పాఠశాల ప్రిన్సిపాల్ సుజా ఫిలిప్ చెప్పారు. ‘మాకు వేరే ఉద్దేశాలు లేవు. అది తప్పు అయితే, ఇకపై అది జరగదని మేము నిర్ధారిస్తాము. ఇక్కడ అన్ని పండుగలు జరుపుకుంటాం. ముగ్గురు ముస్లిం విద్యార్థులు మాత్రమే ఖురాన్ పఠనం చేసారు, అందరు కాదు అని  మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ఇది సెక్యులర్ పాఠశాల.’ ఒక సీనియర్ పోలీసు అధికారి న్యూస్ 9తో మాట్లాడుతూ, ‘ప్రతి పండుగలకు పాఠశాల అటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది – అది హిందూ, ముస్లిం లేదా క్రిస్టియన్ ఏ మతమైనా కావచ్చు.’ అని అన్నారు. 

చివరిగా, ఈ వీడియో కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలో తీసింది కాదు. ఇది జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో బక్రీద్ వేడుకలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll