ఒక ముసలి వ్యక్తి ఫోటోని షేర్ చేస్తూ, ఆ వ్యక్తి వయసు 180 సంవత్సరాలని, మరణం ఇతడిని మరిచిపోయిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 180 సంవత్సరాల వయసు గల భారతీయ వ్యక్తి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఇదే ఫోటో, వివరాలతో ఒక కల్పిత కథనాలు రాసే వెబ్సైటు 2014లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక్కడి నుండే ఈ కథనం ఇంటర్నెట్ లో షేర్ అయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, జీన్ లూయిస్ కాల్మెంట్ అనే వ్యక్తి పేరుపై సుదీర్ఘమైన జీవితం గడిపిన వ్యక్తిగా రికార్డు నమోదయ్యి ఉంది. ఈమె 21 ఫిబ్రవరి 1875 న ఫ్రాన్స్‌లో జన్మించి122 సంవత్సరాల వయస్సులో 4 ఆగస్టు 1997న మరణించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ విషయం గురించి గూగుల్ లో వెతకగా 2014లో ఇదే ఫోటో మరియు వివరాలతో worldnewsdailyreport.com లో ఒక కథనం ప్రచురితమైంది. కాకపోతే ఈ కథనంలో వయసు మాత్రం 179 సంవత్సరాలు అని ఉంది.
ఐతే ఈ వెబ్సైటులో ఉన్న డిస్‌క్లైమర్ ప్రకారం ఈ వెబ్సైటులో ప్రచురితమయ్యే కథనాలన్ని కల్పితం అని స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి ఈ 179 సంవత్సరాల వ్యక్తి కథనం కూడా కల్పితమనే మనం అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ వెబ్సైటులోని ఇతర కథనాలు కూడా కల్పితమైనవే.
ఒకవేళ నిజంగానే పోస్టులో చెప్పిన వ్యక్తి భారత్ లో ఉండి ఉంటే ఇక్కడి మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి విశ్వసనీయ వార్తా కథనాలు ఏవి కూడా మాకు లభించలేదు. ఒక భారతీయ సంస్థ ఇదే కథనాన్ని ప్రచురించినప్పటికీ, ఈ కథనం పూర్తిగా కల్పితమని పేర్కొంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, జీన్ లూయిస్ కాల్మెంట్ అనే వ్యక్తి పేరుపై సుదీర్ఘమైన జీవితం గడిపిన వ్యక్తిగా రికార్డు నమోదయ్యి ఉంది. ఈమె 21 ఫిబ్రవరి 1875 న ఫ్రాన్స్‌లో జన్మించి122 సంవత్సరాల వయస్సులో 4 ఆగస్టు 1997 న మరణించింది.
ఇకపోతే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మాకు ఎటువంటి వివరాలు లభించలేదు. కాకపోతే ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 2007 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉందని తెలుస్తుంది. ఈ వివరాల బట్టి ఈ వివరాలు పూర్తిగా కల్పితమని అర్ధం చేసుకోవచ్చు. గతంలో కూడా ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు స్నోప్స్ వారు ఈ విషయాన్నీ తప్పని చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, మరణం మర్చిపోయిన 180 సంవత్సరాల వయసు గల భారతీయుడి కథ పూర్తిగా కల్పితం.