Fake News, Telugu
 

విన్‌స్టన్‌ చర్చిల్, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌కు సంబంధించిందని షేర్ చేస్తున్న ఈ కథ నిజం కాదు

0

బావిలో పడిన ఒక అబ్బాయిని అటు వైపు వెళుతున్న ఒక రైతు కాపాడాడని, అందుకు కృతజ్ఞతగా ఆ అబ్బాయి తండ్రి, రైతు కొడుకును పెద్ద చదువులు చదివిస్తాడు; కొంతకాలానికి ఆ అబ్బాయికి అంతు తెలియని వ్యాధి వస్తే ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఆ రైతు కొడుకు ఎవరో కాదు పెన్సిలిన్ మందుని కనిపెట్టిన అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ అని, అబ్బాయి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విన్‌స్టన్‌ చర్చిల్ ప్రాణాన్ని కాపాడిన అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ యొక్క కథ.

ఫాక్ట్: ఇది ఒక కల్పిత కథ. కథలో చెప్పిన విధంగా చర్చిల్ బావిలో మునిగినట్టు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. లార్డ్ రాండోల్ఫ్ (చర్చిల్ తండ్రి) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ విద్యకోసం డబ్బు చెల్లించారని చెప్పడానికి కూడా ఎటువంటి రికార్డు లేదు. కెవిన్ బ్రౌన్ రాసిన అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ యొక్క జీవిత చరిత్ర, “పెన్సిలిన్ మ్యాన్: అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ అండ్ ది యాంటీబయాటిక్ రెవల్యూషన్”లో, ఈ కథను “very nice fable” (కట్టు కథ) అని అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ అన్నారని తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.          

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటిది జరిగినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి కచ్చితమైన సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. చరిత్రకారులు, పుస్తకాలలో కూడా దీని గురుంచి ప్రస్తావన ఉండేది. కానీ, ఇటువంటి సంఘటనలు జరిగినట్టు ఎక్కడా ప్రస్తావన లేదు.
కథలో చెప్పిన విధంగా చర్చిల్ బావిలో మునిగినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

కెవిన్ బ్రౌన్ రాసిన అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ యొక్క జీవిత చరిత్ర, “పెన్సిలిన్ మ్యాన్: అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ అండ్ ది యాంటీబయాటిక్ రెవల్యూషన్”లో, ఈ కథను “very nice fable” (కట్టు కథ) అని అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ అన్నారని తెలిపారు.

చర్చిల్ యొక్క జీవిత చరిత్ర రచయిత సర్ మార్టిన్ గిల్బర్ట్ కథలో ఉన్న లోపాలను వివరించారు. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ చర్చిల్ కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడు. లార్డ్ రాండోల్ఫ్ (చర్చిల్ తండ్రి) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్ విద్యకోసం డబ్బు చెల్లించారని చెప్పడానికి కూడా ఎటువంటి రికార్డు లేదు. చర్చిల్ బావిలో మునిగినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

1943 లో చర్చిల్ కు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది. చర్చిల్ యొక్క వైద్య చరిత్రపై నిపుణుడైన డాక్టర్ జాన్ మాథర్ “చర్చిల్ పెనిసిలిన్ తో కాకుండా ‘ఎం అండ్ బి’తో చికిత్స చేసారు, ఇది మే బేకర్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన సల్ఫాడియాజిన్.” అని తెలిపారు.

చివరగా, విన్‌స్టన్‌ చర్చిల్ మరియు అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌కు సంబంధించిందని షేర్ చేస్తున్న ఈ కథ నిజం కాదు, ఒక కట్టు కథ.

Share.

About Author

Comments are closed.

scroll