Fake News, Telugu
 

క్యాన్సర్ పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ఈ పథకం 2009 నుంచే అమలులో ఉంది

0

“క్యాన్సర్ జబ్బు ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా 15 లక్షల రూపాయలు అందిస్తుందట. ఈ డబ్బును నేరుగా పేషెంట్లు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందట. ఈ పధకం గత 4 సంవత్సరాల నుండి అమలులో ఉందట”, అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.  

క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన పథకం ద్వారా కాన్సర్ జబ్బు ఉన్న పేదల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందిస్తుంది.

ఫాక్ట్: ఈ పథకాన్ని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కాన్సర్ పేషెంట్లకు ఈ పథకం వర్తిస్తుంది, మరియు దేశంలో ఉన్న 27 క్యాన్సర్ సెంటర్లలో చికిత్స తీసుకునే వారికి మాత్రమే చికిత్స ఖర్చుని బట్టి ఆర్ధిక సహాయం అందుతుంది. 2019లో ఈ పథకంలో భాగంగా ఇచ్చే ఆర్ధిక సాయాన్ని గరిష్టంగా ఒక్కో పేటెంట్‌కు ₹15 లక్షలుగా నిర్ణయించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, ఈ విషయాన్ని గురించి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక వెబ్‌సైట్లో వెతకగా, ఈ పథకం పేరు ‘Health Minister’s Cancer Patient Fund’ (HMCPF) అని తెలిసింది. దీనిని 2009లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు. 1996లో తీసుకువచ్చిన ‘Rashtriya Arogya Nidhi’ (RAN) పథకం కింద HMCPF అమలవుతుంది.

ఈ పథకానికి ఎవరు అర్హులు?

  1. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కాన్సర్ బాధితులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేయబడుతుంది.
  2. దేశంలో ఉన్న 27 రీజియనల్ క్యాన్సర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
  4. క్యాన్సర్ చికిత్స ఉచితంగా పొందుతున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు.

పథకంలో భాగంగా 2009 లోనే ₹100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అర్హులైన క్యాన్సర్ పేషెంట్లకు రూ.లక్ష లోపు అయ్యే చికిత్స వ్యయాన్ని క్యాన్సర్ సెంటర్లలో ఉంచిన రివాల్వింగ్ ఫండ్‌ నుంచి ఖర్చు చేస్తారు. చికిత్సకు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం అవసరమైతే కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.

గరిష్టంగా ఒక పేషంట్‌కు  కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం విడుదల చేస్తుందనేది ఇక్కడ పేర్కొనలేదు. అయితే, 2009-10 గణాంకాల ప్రకారం, ₹11 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

అయితే 2019లో ఇదే పథకాన్ని సవరించి, ప్రభుత్వం విడుదల చేసే గరిష్ట ఆర్థిక సాయాన్ని ₹15 లక్షలుగా నిర్ణయించారు.

చివరిగా, 2009 నుంచే ఈ పథకం అమలులో ఉండగా, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తప్పుడు ప్రచారం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll