2024 పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 118-124 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి 48-51 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 0-1 సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో ఉంది. అలాగే ఈ రిపోర్ట్‌కు సంబంధించిన వార్తను ఈటీవీ ప్రచురించినట్టు ఒక వీడియో రిపోర్ట్ కూడా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ రిపోర్ట్‌లకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 118-124 సీట్లు వస్తాయి – ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే రిపోర్ట్ ; ఈ రిపోర్ట్‌కు సంబంధించి ఈటీవీ ప్రచురించిన వార్తా కథనం.
ఫాక్ట్(నిజం): ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించినట్టు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఇలానే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో షేర్ అయిన రిపోర్ట్స్ ఫేక్ అని వార్తా సంస్థలు నిర్ధారించాయి. ఇదిలా ఉండగా ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేకు సంబంధించిన వార్తను తాము ప్రసారం చేయలేదని ఈటీవీ స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించినట్టు ఎటువంటి అధికారిక రిపోర్ట్స్ మాకు దొరకలేదు. సాధారణంగా ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలో ఇలా ఎన్నికల సర్వే నిర్వహించినట్టు కూడా మాకు ఎలాంటి ఉదాహరణలు లభించలేదు.
పైగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో షేర్ అవుతున్న రిపోర్ట్‌ను పరిశీలిస్తే కొన్ని పొరపాట్లు గమనించవచ్చు. ఆ రిపోర్ట్ 10 ఏప్రిల్ 2024 నాడు విడుదలైనట్టు ఉండగా ఈ సర్వే యొక్క పూర్తి వివరాలు 08 ఏప్రిల్ 2024 నాడు విడుదల చేయనున్నట్టు రిపోర్ట్ చేసారు. సాధారణంగా ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి సంస్థ ఇలాంటి పొరపాట్లు చేయవు.
ప్రస్తుతం షేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వే నిజమని నమ్మించడానికి 2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి సర్వే నిర్వహించినట్టు మరొక రిపోర్ట్‌ను కూడా షేర్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా సర్వే చెప్పినట్టే వచ్చాయని చెప్పే ఉద్దేశంతో ఇలా చేసారు.
ఐతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాంటి సర్వే నిర్వహించలేదు. అప్పట్లో ఈ రిపోర్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయినప్పుడు ఇది ఫేక్ రిపోర్ట్ అని, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రిపోర్ట్ విడుదల చేయలేదని చెప్తూ పలు వార్తా సంస్థలు స్పష్టం చేసాయి. పైగా ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఉన్న ఈ రిపోర్ట్‌లో RAW లోగోను ముద్రించారు. దీన్నిబట్టి ఈ రిపోర్ట్ ఫేక్ అని స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే రిపోర్ట్‌ను ఈటీవీ రిపోర్ట్ చేసినట్టు షేర్ అవుతున్న వీడియో కూడా ఫేక్. దీనిని డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. ఈ వీడియో వైరల్ అవుతుండడంతో ఈ కథనాన్ని తాము ప్రసారం చేయలేదని ఈటీవీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపింది. వీటన్నిటి బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్నవన్నీ ఫేక్ రిపోర్ట్స్ అని స్పష్టమవుతుంది.
చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో షేర్ అవుతున్న ఈ రిపోర్ట్ ఫేక్.