Fake News, Telugu
 

కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా ప్రజలు మోదీ నినాదాలు చేసినట్లుగా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా సభలోని కొందరు మోదీ మోదీ అని నినాదాలు చేయడంతో ఖర్గే ఆగ్రహంతో ఊగిపోయాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా సభలో కొందరు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేయడంతో మల్లికార్జున ఖర్గే వారిపై అసహనం వ్యక్తం చేస్తు తన ప్రసంగంపై ఆసక్తి లేకుంటే సమావేశం నుండి వెళ్లిపోవాలని వారిని కోరినట్టుగా చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ‘మోదీ మోదీ’ అని కొందరు నినాదాలు చేయడంతో వారిపై ఖర్గే అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): 26 నవంబర్ 2023న తెలంగాణలోని కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను క్లిప్ చేసి దానికి ‘మోదీ, మోదీ’ అనే ఆడియోను జత చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా, మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా ప్రజలు ఎక్కడా ‘మోదీ, మోదీ’ అని నినాదాలు చేయడం కనిపించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోను “TIMES NOW” వార్త సంస్థ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 27 నవంబర్ 2023న పబ్లిష్ చేసింది. ఈ వీడియో కథనం ప్రకారం, తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసహనానికి గురై, సభలో ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ సమాచారం ఆధారంగా, ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి వీడియో కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో క్లిప్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి సంబంధించింది అని మేము కనుగొన్నాము. ఈ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే చేసిన పూర్తి ప్రసంగానికి సంబంధించిన వీడియోను భారత జాతీయ కాంగ్రెస్(INC) తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 26 నవంబర్ 2023న పబ్లిష్ చేసింది.

ఈ వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, టైం స్టాంప్ 20:18 వద్ద మల్లికార్జున ఖర్గే ప్రసంగం మొదలు అవుతుంది, ప్రభుత్వం గత ఎన్నికల్లో  రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటిని మేము చేస్తామని ఖర్గే చెప్తుండగా, సభలోని కొంతమంది అస్పష్టంగా కొన్ని నినాదాలు చేస్తూ, ఖర్గే ప్రసంగానికి ఆటంకం కలిగించారు. వారిపై ఖర్గే అసహనం వ్యక్తం చేయడం మనం టైం స్టాంప్ 21:06 వద్ద నుండి చూడవచ్చు. ఖర్గే మాట్లాడుతూ, “నిశ్శబ్దంగా కూర్చోండి, వినాలి అని ఉంటే వినండి, లేదు మీరు వినడానికి ఇష్టపడకపోతే, వెళ్ళిపోండి. అలా మాట్లాడకు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడని తెలియదా? నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీకు కావాలంటే వినండి, లేకపోతే వదిలేయండి” (హిందీ నుండి తెలుగులోకి అనువదించగా). అయితే, ఈ ఒరిజినల్ వీడియోలో, ‘మోదీ, మోదీ’ అని సభలో నినాదాలు చేయడం కనిపించలేదు.  దీన్ని బట్టి చూస్తే, తెలంగాణలోని కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఖర్గే ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను క్లిప్ చేసి దానికి ‘మోదీ, మోదీ’ అనే ఆడియోను జత చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించినట్లు నిర్ధారించవచ్చు.

చివరగా, కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా ప్రజలు మోదీ నినాదాలు చేసినట్లుగా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll