Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అచ్చెన్నాయుడు విడుదల చేసిన బహిరంగ లేఖగా షేర్ చేస్తున్న ఈ ఫోటో ఫేక్

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అతను మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడని, అతను చేసిన వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీకి (టీడీపీ) ఎటువంటి సంబంధం లేదని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ఇటీవల ఒక లేఖ విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజల దగ్గర సమాచారాన్ని సేకరించి అమ్మాయిలను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ నేరాలకు సహాయపడుతున్నారని పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరులో జరిగిన వారాహి యాత్ర ర్యాలీలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈ బహిరంగ లేఖను విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, తాను అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తొలగిస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసినట్టు దిశ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన వార్తా కథనం స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. 

క్లెయిమ్: పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యాలకు సంబంధించి అచ్చెన్నాయుడు విడుదల చేసిన లేఖ మరియు దిశ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన కథనం యొక్క స్క్రీన్ షాట్లు.

ఫాక్ట్ (నిజం): పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాను విడుదల చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఈ లేఖ ఫేక్ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలాగే, పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తీసేస్తానని వ్యాఖ్యానించినట్టుగా షేర్ చేస్తున్న కథనాన్ని తమ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని దిశ వార్తా సంస్థ కూడా స్పష్టం చేసింది. కావున, ఈ పోస్టులలో చేస్తున్న క్లెయింలు తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అటువంటి లేఖ ఏదైనా అచ్చెన్నాయుడు ఇటీవల విడుదల చేశారా అని వెతికితే, సోషల్ మీడియాలో ప్రచారంలో చేస్తున్న లేఖకు సంబంధించి స్పష్టతనిస్తూ అచ్చెన్నాయుడు 13 జులై 2022 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఈ లేఖను తాను వ్రాయలేదని అచ్చెన్నాయుడు ఈ పోస్టులో స్పష్టం చేశారు.

వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్పందిస్తూ, “వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహమని, దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.” టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు సమాజాసేవకు మాత్రమే పరిమితం చేస్తామని చంద్రబాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సభ్యుడు టీడీపీ నేత కేశినేని నాని స్పందిస్తూ, వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. వాలంటీర్లలో కొందరు చెడ్డ వాళ్లు ఉంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని తప్పుపట్టడం సబబు కాదని, ప్రజల కోసం పనిచేసి, ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను టీడీపీ స్వాగతిస్తుందని కేశినేని నాని వ్యాఖ్యానించినట్టుగా పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

అలాగే, పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తీసేస్తానని తాము రిపోర్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కథనం ఫేక్ అని, ఆ కథానాన్ని తమ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని దిశ వార్తా సంస్థ స్పష్టం చేసింది.

చివరగా, పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అచ్చెన్నాయుడు విడుదల చేసిన బహిరంగ లేఖ అంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll