Fake News, Telugu
 

గత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్ధిక వైఫల్యాలంటూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు

0

నరేంద్ర మోదీ అధికారములోకి రాకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉండేదని, మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడిందని అంటూ, ఈ నేపథ్యంలో మోదీ సాధించిన విజయాలను పేర్కొన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ పోస్టులో అంతకుముందున్న ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రస్తావించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని  తీసివేయాలని / తనఖా పెట్టాలని నిర్ణయించాడు ; ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R(B)) ద్వారా రూ2.23లక్షల కోట్ల రుణం తీసుకొందంటూ పలు క్లెయిమ్స్ కూడా చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న అంశాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: గత ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాల ఉదాహరణలు ; మోదీ ప్రభుత్వ ఆర్ధిక విజయాలు.

ఫాక్ట్: 2013లో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన ఆనంద్ శర్మ రూపాయి మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ తమ వద్ద ఉన్న బంగారు నిలువలను మోనటైజ్ చేయాలని కేవలం సలహా ఇచ్చాడు. అయినా, ఇది ఆర్‌బిఐ పరిధిలోని అంశం, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం F.C.N.R(B) స్కీం ద్వారా అప్పులు చేయలేదు. ఇది కూడా ఆర్‌బిఐ పరిధిలోని అంశం. 2013లో తగ్గుతున్న విదేశీమారక నిల్వలను బలపరిచేందుకు, కరెంటు ఎకౌంటు డేఫెసిట్ తగ్గించేందుకు ఈ స్కీం ద్వారా ఆర్‌బిఐ డాలర్లను సేకరించింది. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయినాక తిరిగి మొత్తాన్ని చెల్లించింది, దీనికి ప్రభుత్వంతో సంబంధంలేదు. ఇకపోతే మోదీ హాయాంలో బంగారు నిల్వల సాధారణంగానే పెరిగాయి. మార్చ్ 2014 నాటికి 557.8 టన్నులు ఉన్న బంగారు నిల్వలు, సెప్టెంబర్ 2021 నాటికి 743.84 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. అంటే ఈ ఏడు సంవత్సరాలలో బంగారు నిల్వల పెరుగుదల సాధారణంగానే ఉంది, పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు గణనీయమైన పెరుగుదల లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అప్పటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని  తీసివేయాలని/ తనఖా పెట్టాలని నిర్ణయించాడు:

2013లో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన ఆనంద్ శర్మ రూపాయి మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ తమ వద్ద ఉన్న బంగారు నిలువలను మోనటైజ్ చేసే అంశాన్ని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. దీనివల్ల దిగుమతులు తగ్గించొచ్చు మరియు డాలర్ నిలువలు పెంచుకోవచ్చు అని అయన తెలిపారు. ఐతే ఎలా మోనటైజ్ చేయాలన్నది ఆయన వివరించలేదు.

ఐతే ఈ నిర్ణయం రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా పరిధిలోని అంశమని, తాను కేవలం సలహా ఇస్తున్నానని, నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్‌బిఐ అని తెలిపారు. ఐతే అప్పట్లో ఆనంద్ శర్మ వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తాను బంగారం నిల్వలను అమ్మాలని గాని లేక తనఖా పెట్టలనిగాని అనలేదని, కేవలం వాటిని మోనటైజ్ చేసే అంశాన్ని పరిశీలించాలని మాత్రమే అన్నట్టు ఆనంద్ శర్మ రాజ్యసభలో వివరణ ఇచ్చాడు.

ఐతే పోస్టులో ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయం అని చేసిన వాదన తప్పని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా పరిధిలోని అంశం, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాసిట్ (F.C.N.R(B)) ద్వారా రూ2.23లక్షల కోట్ల రుణం తీసుకొంది, ఈ రుణాన్ని మోడీ ప్రభుత్వం తీర్చింది:

ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R(B)) అనేది రుణం కాదు, దీని ద్వారా ఆర్‌బిఐ NRIల నుండి డాలర్లను సేకరించింది. తగ్గుతున్న విదేశీమారక నిల్వలను బలపరిచేందుకు, కరెంటు ఎకౌంటు డేఫెసిట్ తగ్గించేందుకు ఈ స్కీంని అవలంభించింది.

2013లో ఈ స్కీం ద్వారా బ్యాంకులు తమ NRI కస్టమర్ల నుండి ఫిక్స్డ్ వడ్డీ రేట్లకు, ఒక నిర్దిష్ట మెచ్యూరిటీ సమయానికి డాలర్లను సేకరించాయి. ఈ డాలర్లను బ్యాంకులు నిర్దిష్ట వడ్డీ రేట్లకు ఆర్‌బిఐకి అందిస్తాయి (స్వాప్). మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయినాక  ఆర్‌బిఐ తిరిగి ఈ మొత్తాన్ని డాలర్ల రూపంలో బ్యాంకులకు అందిస్తుంది, బ్యాంకులు తిరిగి తమ NRI డిపాజిటర్లకు అందుబాటులోకి తెస్తుంది.

NRI కస్టమర్లు ఈ స్కీం ద్వారా మొదట డాలర్లు డిపాజిట్ చేస్తే, తిరిగి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయాక డాలర్ల రూపంలోనే తమ డిపాజిట్లను పొందవచ్చు. ఈ మధ్య కాలం ఒకవేళ రూపాయి విలువ తగ్గితే, రూపాయి మారకం వల్ల బ్యాంకులు NRIలకు అందించాల్సిన దాంట్లో ఏదైనా నష్టం వస్తే బ్యాంకుల నష్టాన్ని తాము భరిస్తామని ఆర్‌బిఐ ముందుగానే ఒప్పందం చేసుకొని 2013లో ఈ స్కీంని అవలంభించింది.

2016 ఈ స్కీం ద్వారా సేకరించిన మొత్తం మెచ్యూర్ కావడంతో NRI డిపాజిటర్లకు 20 బిలియన్ డాలర్లు కూడా చెల్లించారు. ఈ విషయం పోస్టులో షేర్ చేసిన ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనంలో ఉంది. ఐతే రఘురాం రాజన్ మాట్లాడుతూ ఈ స్కీం మొదలు పెట్టినప్పుడు తమ ముందున్న అన్ని మార్గాలలో కెల్లా తక్కువ రిస్క్ గల మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. పైగా ఈ స్కీం అవలంభించిన తరవాత రూపాయి విలువ బలపడిందని, ఈ స్కీం సక్సెస్ అయ్యిందని అయన అన్నారు.

ఐతే పోస్టులో చెప్తునట్టు ఈ మొత్తాన్ని మోదీ ప్రభుత్వం తీర్చేసిందన్న వాదన పూర్తిగా అవాస్తవం. పైన తెలిపినట్టు మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక ఆర్‌బిఐ పూర్తి మొత్తాన్ని చెల్లించింది. అసలు ఈ స్కీం ద్వారా సేకరించినదానికి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు. ఇది ఆర్‌బిఐ సొంత నిర్ణయం. ఆర్‌బిఐ తమ సొంత నిల్వల నుండి ఈ మొత్తాన్ని తెర్చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదు. రూపాయి మారకం విలువ స్థిరపరచడం, విదేశీ మారక నిల్వలు పెంచడం మొదలైనవి ఆర్‌బిఐ యొక్క  ప్రధాన విధులు. ఇందులో భాగంగానే ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది, ఆ అధికారం ఆర్‌బిఐకి ఉంది.

పైగా ఇలా డాలర్లు సేకరించడం కొత్తేమి కాదు, గతంలో కూడా ఇలా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాసిట్ స్కీం ద్వారా డాలర్లను సేకరించారు. 1980ల్లో ఈ స్కీం ద్వారా విదేశీ కరెన్సీ సేకరించినప్పుడు కూడా రూపాయి మారకం విలువలో ఏదైనా మార్పుల వల్ల నష్టం వస్తే, ఆ నష్టాన్ని ఆర్‌బిఐ భరించేది. ఐతే ఈ స్కీం వల్ల ఎక్కువ భారం పడుతుండడంతో 1994లో ఈ స్కీంని నిలిపేశారు. తిరిగి ఈ స్కీంకి కొన్ని మార్పులు చేసి (F.C.N.R(B)) పేరుతో మళ్ళి కొత్తగా ప్రారంభించారు.

5.57 టన్నుల బంగారం నిల్వలను, మోడీ 705 టన్నులకు పెంచారు:

మార్చ్ 2014 నాటికి రిజర్వు బ్యాంకు వద్ద 557.8 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. అంటే మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చేసరికి ఇన్ని నిల్వలు ఉన్నాయి. అదే సెప్టెంబర్ 2021 నాటికి 743.84 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. అంటే ఈ ఏడు సంవత్సరాలలో బంగారు నిల్వల పెరుగుదల సాధారణంగానే ఉంది, పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు గణనీయమైన పెరుగుదల లేదు.

మోదీ సాధించిన విజయాలు:

పోస్టులో మోదీ సాధించిన విజయలంటూ ప్రస్తావించిన పలు అంశాల గురించి కింద వివరంగా చూద్దాం.

మోదీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు:

2018లో జరిగిన కామన్వెల్త్ సభ్య దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం మోదీ పాల్గొన్నారు, ఇదే పోస్టులో ప్రస్తావించిన మోదీ బ్రిటన్‌లో పాల్గొన్న 53 సభ్య దేశాల సమావేశం. ఈ సమావేశంలో మానవ హక్కులు, క్లైమేట్ చేంజ్ మొదలైన చాలా అంశాలపై చర్చలు జరిగాయి.

ఐతే ఈ సమావేశానికి కామన్వెల్త్ చైర్-ఇన్-ఆఫీస్ గా అప్పటి బ్రిటన్ ప్రధాని తెరెసా మే వ్యవహారించారు. ఈ సమావేశం ప్రెసిడెంట్ గా మోదీని ఎన్నుకోలేదు. ఈ సంవత్సరం జరగాల్సిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం కరోనా కారణంగా వాయిదా పడింది.

UN భద్రతా మండలిలో భారతదేశం అత్యధిక ఓట్లు సాధించిన సభ్యదేశంగా నిలిచింది. 97 ఓట్లు అవసరం ఉండగా, 188 ఓట్లు వచ్చాయి:

జూన్ 2020లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు నాన్-పెర్మనెంట్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో భారత్, మెక్సికో, కెన్యా, నార్వే మరియు ఐర్లాండ్ ఎన్నికయ్యాయి. ఈ ఎన్నికల్లో పోల్ అయిన మొత్తం 192 వోట్లలో భారత్ 184 వోట్లు సాధించింది. ఐతే ఈ ఎన్నికల్లో మెక్సికో అత్యధికంగా 187 వోట్లు సాధించింది.

ఐతే గతంలో కూడా అనేక సార్లు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైంది. చివరిసారిగా 2011-12లో ఎన్నిక కాగా, ఆ సమయంలో భద్రతా మండలికి ఎన్నికైన అన్ని దేశాలకన్నా ఎక్కువగా 187 వోట్లు సాధించింది. 

ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది:

గత సంవత్సరం అక్టోబర్ లో సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2020లో భారతదేశం నాల్గవ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. అమెరికా, చైనా మరియు జపాన్ ఈ లిస్టులో భారత్ కంటే ముందున్నాయి. ఐతే ఈ ఇండెక్స్ కేవలం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కేవలం 26 దేశాలకు మాత్రమే పరిమితం, ప్రపంచంలోని అన్ని దేశాలకు కాదు.

ఇకపోతే ఈ వైరల్ పోస్టులో చేసిన మిగతా క్లెయిమ్స్ చాలా వరకు నిజమే అయినప్పటికీ, అవన్నీ గతంలోని విషయాలకు సంబంధించివి. ఉదాహారణకి భారత్ ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను దాటి రెండో ర్యాంకు సాధించిన వార్త 2018కి సంబంధించింది. అలాగే భారత్ చక్కర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను దాటేసి మొదటి స్థానానికి చేరకోబోతుందన్న వార్త కూడా 2018కి సంబంధించింది.

చివరగా, గత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్ధిక వైఫల్యాలంటూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll