Fake News, Telugu
 

ఈ ఫోటో రాజీవ్, సోనియా గాంధీల వివాహానంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీసింది. వారి పెళ్లి హిందూ సాంప్రదాయంలోనే జరిగింది

0

ముస్లిం వేషధారణలో ఉన్న భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీల ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇది వారి నిజమైన ఫోటో అని, గాంధీ కుటుంబం ఒక ముస్లిం కుటుంబం అని వైరల్ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

May be an image of 1 person and text that says "నిజం ఎంత దాచినా అది బయటకు వస్తుంది ఇది రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. ఈ నకిలీ గాంధీ కుటుంబం నిజానికి మహమ్మద్ ఘాజీ కుటుంబం. ఈ ఫోటోను 10 మందికి పంపండి, దేశానికి అవగాహన కల్పించి, భారత్‌ను పాకిస్తానగా మార్చకుండా కాపాడండి."
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ముస్లిం వేషధారణలో ఉన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. గాంధీ కుటుంబం ముస్లిం మతాన్ని పాటిస్తుంది.

ఫాక్ట్: ఈ ఫోటో ఫిబ్రవరి 1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం అనంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీయబడింది. అయితే, రాజీవ్, సోనియా గాంధీల పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరిగిందని అనేక ఆధారాలు చెప్తున్నాయి. అలాగే, జవహర్ లాల్ నెహ్రూ, ఫిరోజ్ గాంధీల కుటుంబాలు ముస్లిం మతానికి చెందినవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలు లభించలేదు. అయితే,సంబంధిత పదాలతో భారత ప్రభుత్వం వారి indianculture.gov.in వెబ్సైట్లో వెతకగా, ఇదే వేషధారణలో ఉన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ఫోటో లభించింది. ఈ ఫోటో ఫిబ్రవరి 1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం అనంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీసినట్లుగా వివరణలో పేర్కొన్నారు. ఈ ఫోటోలో రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీ, మాజీ భారత రాయబారి మహమ్మద్ యూనుస్ తదితరులు ఉన్నట్లు చెప్పబడింది.

రాజీవ్, సోనియా గాంధీల వివాహం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, వారి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోలో వాళ్లిద్దరూ దండలతో ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలలో (ఇక్కడ & ఇక్కడ) కూడా వారు బొట్టు పెట్టుకొని, దండలతో ఉన్నట్టు చూడవచ్చు. రాజీవ్, సోనియా గాంధీల వివాహం 25 ఫిబ్రవరి 1968న జరిగింది. 26 ఫిబ్రవరి 1968 నాడు ‘ది ఇండియన్ ఎక్సప్రెస్’ వారు ఆ వివాహానికి సంబంధించి ప్రచురించిన అర్టికల్‌లో రాజీవ్ గాంధీ మరియు సోనియా మైనో వేద మంత్రాల మధ్య దండలు మార్చుకుని, రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నట్టు చదవచ్చు.

అంతేకాదు, వారి వివాహం గురించి వివిధ పుస్తకాల్లో కూడా చదవచ్చు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఎక్కడా కూడా వారి వివాహం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని పేర్కొనబడలేదు. వారి వివాహం క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిందని కొందరు ఇంతకముందు షేర్ చేయగా, అది తప్పు అంటూ 2018లో ‘ది ప్రింట్’ వారు ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. అలాగే, జవహర్ లాల్ నెహ్రూ, ఫిరోజ్ గాంధీలు ముస్లిం మతానికి చెందినవారని గతంలో ప్రచారం జరగగా, ఇది తప్పుడు సమాచారం అని FACTLY ఇంతకుముందు వివరంగా రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

A text on a white background  AI-generated content may be incorrect.

చివరిగా, రాజీవ్, సోనియా గాంధీల వివాహం ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం జరిగిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వైరల్ ఫోటో వారి పెళ్లి అనంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీసినది.

Share.

About Author

Comments are closed.

scroll