భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక మహిళ మెడని పట్టుకొని ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఆమె బ్రిటిష్ మహిళ అని, భారత్‌కు స్వాతంత్య్రం తేవడం కోసం నెహ్రూ ఈ విధంగా వ్యవహరించాడని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ మహిళతో సన్నిహితంగా వ్యవహరించిన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటో.
ఫాక్ట్: ఫోటోలో ఉన్న మహిళ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనెడి భార్య జాక్వెలిన్ బి. కెనెడి. 1962లో ఆమె భారత పర్యటన సందర్భంగా భారత మాజీ ప్రధాని నెహ్రూని కలిసినప్పుడు ఈ ఫోటో తీశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోని 2014లో టంబ్లర్ వెబ్‌సైట్లో ప్రచురించినట్లు గుర్తించాము. అయితే, ఫోటో కింద వివరణలో ఆ మహిళా పేరు జాకీ కెనెడి అని, ఈ ఫోటోని 1962 ఢిల్లీలో తీశారని పేర్కొన్నారు.
ఇక జాకీ కెనెడి గురించి వెతకగా, ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనెడి భార్య అని తెలిసింది. ఆమె పూర్తి పేరు జాక్వెలిన్ బి. కెనెడి. ఆమె 1962లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ఫొటోని తీశారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, 1962లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనెడి భార్య జాక్వెలిన్ బి. కెనెడితో నెహ్రూ ఉన్న ఫొటోని స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ మహిళతో ఉన్నట్లు తప్పుగా షేర్ చేస్తున్నారు.