పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నాడు చేపట్టిన నిరాహార దీక్షలో తనకు మద్దతుగా సినీ నటుడు కృష్ణ పాల్గొన్నప్పటి ఫోటో అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. నటుడు కృష్ణ ఈ నెల 15వ తేదీన మృతి చెందారు, ఈ సందర్భంలో ఈ పోస్టులో ఉన్న ఫోటో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్షకి మద్దతుగా తెలుగు సినీనటుడు కృష్ణ పాల్గొన్నప్పటి ఫోటో.
ఫ్యాక్ట్ (నిజం): పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబర్ 1952 నుండి 15 డిసెంబర్ 1952 వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 1943లో జన్మించిన కృష్ణకి అప్పుడు తొమ్మిది ఏళ్ళు, అప్పటికి ఆయన చిత్రసీమలో ప్రవేశించలేదు. 1973లో జై ఆంధ్ర ఉద్యమానికి అయన మద్దతు పలికారు. 18 ఫిబ్రవరి 1973న ఆయన 24 గంటల పాటు నిరాహార దీక్ష చేసారు. వార్త సంస్థల కథనాల ప్రకారం ఈ చిత్రం అప్పటిది. కావున, పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఆ ఫోటో ఉన్న కొన్ని వార్త కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం 1973 సమయంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా, కృష్ణ ఒక ప్రకటనని విడుదల చేసారు.
అంతే కాకుండా, ఫిబ్రవరి 1973లో ఆయన 24 గంటల పాటు మద్రాస్ లో నిరాహార దీక్ష చేశారు (చదవండి). ఆ దీక్షకి సంబంధించి ఆంధ్ర భూమి పత్రికలో 19 ఫిబ్రవరి 1973న ప్రచురితమైన ఒక కథనాన్ని ఇక్కడ చదవచ్చు. ఆంధ్రజ్యోతి వారి కథనం ప్రకారం ఈ పోస్టులో ఉన్న చిత్రం ఆ నిరాహార దీక్ష సమయంలోనిదే.
పొట్టి శ్రీరాములు అక్టోబర్ 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్త్ర సాధన కోసం మద్రాసులో ఆమరణ నిరాహారణ దీక్ష చేపట్టారు (చదవండి). 15 డిసెంబర్ 1952వ తేదీన ఆయన మృతి చెందారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది అని అప్పట్లో డాక్టర్లు చెప్పినట్లు ఆంధ్ర భూమిలో ప్రచురితమైన వార్తని ఇక్కడ చదవచ్చు.
ఈ దీక్ష సమయంలో 1943లో పుట్టిన కృష్ణ వయస్సు తొమ్మిది సంవత్సరాలు, అయన ఆ సమయానికి సినీ నటుడు కూడా అవలేదు (చదవండి).1965లో ఆయన మొదటి సినిమా తేనె మనసులు విడుదలైంది. కాబట్టి, వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో 1952ది అయ్యే అవకాశం లేదు.
పోస్టులో ఉన్న ఫోటో ఆయనకు తొమ్మిదేళ్ల వయసులో చిత్రించిన ఫోటో లాగా లేదు. ముందుగా చెప్పినట్లు ఈ ఫోటో ఆయన 1973లో జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఆయన చేసిన నిరాహార దీక్షది. అంచేత, ఆ ఫోటో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష సమయంలోది కాదని నిర్ధారించుకోవచ్చు.
చివరిగా, తెలుగు సినీనటులు కృష్ణ ఈ ఫోటోకి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్షకి సంబంధం లేదు.