గత మూడు రోజులుగా కాలికి గాయమై బెడ్ రెస్ట్ తీసుకుంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, హటాత్తుగా వీల్ చైర్ నుండి లేచి తన కారు ఎక్కుతున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గత మూడు రోజులుగా కాలికి గాయమై బెడ్ రెస్ట్ తీసుకుంటున్న మమత బెనర్జీ, హఠాత్తుగా వీల్ చైర్ నుండి లేచి తన కారు ఎక్కుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో మమతా బెనర్జీ వీల్ చైర్ పై నే కూర్చొని తన కారు వైపు వెళ్తున్న దృశ్యాన్ని చూపిస్తుంది. ఈ ఫోటో మమతా బెనర్జీ కోల్‌కతా SSKM హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో తీసినది. పోస్టులో షేర్ చేసిన ఎడిటెడ్ ఫోటోని కృష్ణ అనే ఫోటో ఎడిటర్ రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా SSKM హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో తీసిందని తెలిసింది. ఒరిజినల్ ఫోటోలో మమతా బెనర్జీ వీల్ చైర్ పై నే కుర్చుని తన కారు వైపు వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ ఒరిజినల్ ఫోటోని చాలా వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్ లో పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో మమతా బెనర్జీ కి కళ్లద్దాలు లేకపోవడాన్ని మనం గమనించవచ్చు.
ఈ ఎడిట్ చేసిన ఫోటోని కృష్ణ అనే ఫోటో ఎడిటర్ రూపొందించినట్టు తెలిసింది. కృష్ణ ఈ ఫోటోని 14 మార్చి 2021 నాడు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
10 మర్చి 2021 నాడు పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళిన మమతా బెనర్జీకి అక్కడ జరిగిన ఒక సంఘటనలో కాలికి గాయమైనట్టు మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేసాయి. మమతా బెనర్జీ ప్రజల సానుభూతి కోసం ఈ నాటకం ఆడుతునట్టు బీజేపి, కాంగ్రెస్ ఆరోపించాయి. మమతా బెనర్జీ పై ప్రతిపక్ష పార్టీలు దాడి చేసాయనే ఆరోపణని ఎలక్షన్ కమిషన్ కూడా తోసిపుచ్చింది.
చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ మమతా బెనర్జీ ఉన్నట్టుండి తన వీల్ చైర్ నుండి లేచి నడుస్తున్న ద్రుశ్యమని షేర్ చేస్తున్నారు.