భారతదేశ రైతు నిరసనలకి మద్దతుగా స్వీడన్ కి చెందిన గ్రేటా థన్‌బర్గ్ షేర్ చేసిన ‘టూల్‌కిట్’ పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో మహారాష్త్ర కి చెందిన నికిత జేకబ్ పేరు కూడా వచ్చింది; తన పై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయబడింది. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసి, ఆ ఫోటోలో కేజ్రీవాల్ తో ఉన్నది నికిత జేకబ్ అని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. నికిత జాకబ్ మరియు ‘టూల్‌కిట్’ కేసు పై మరింత సమాచారం కోసం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అరవింద్ కేజ్రీవాల్ తో ‘టూల్‌కిట్’ కేసులో నిందితురాలు నికిత జేకబ్ ఉన్న ఫోటో.
ఫాక్ట్: ఫోటోలో అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్నది నికిత జేకబ్ కాదు. తను ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అంకిత షా. ఆ ఫోటోని అంకిత షా 2019 లో పోస్ట్ చేసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోని పోస్ట్ లో చెప్పిన క్లెయిమ్ తో చాలా మంది షేర్ చేసినట్టు తెలిసింది. అయితే, అలా పోస్ట్ చేసిన ఒక ట్వీట్ కింద, ఆ ఫోటోలో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ అంకిత షా అని ఒకరు కామెంట్ చేసారు.
కొన్ని కీ-వర్డ్స్ తో వెతకగా, ఆ ఫోటోని అంకిత షా తన ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్లలో 2019 లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ లో ‘డై హార్డ్ ఫ్యాన్ !! అరవింద్ కేజ్రీవాల్ !! ఆప్ నేషనల్ సోషల్ మీడియా టీమ్ !! ఇండియా’ అని అంకిత షా రాసుకునట్టు చూడవొచ్చు. ఫోటోలో ఉన్నది నికిత జేకబ్ కాదని, అంకిత షా అని ఒకరు పెట్టిన పోస్ట్ ని అంకిత షా షేర్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ఫోటోలో అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్నది ‘టూల్‌కిట్’ కేసులో నిందితురాలు నికిత జేకబ్ కాదు. తను ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అంకిత షా.