2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో గేలుపొందబోతున్నట్టు సిపిఎస్ సర్వే ఇటీవల వెల్లడించింది, అంటూ సాక్షి వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఒక న్యూస్ బులెటిన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 121 నుంచి 130 సీట్లు గెలుస్తుందని సిపిఎస్ సర్వే వెల్లడించినట్టు ఈ వీడియోలో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సిపిఎస్ సర్వే ఇటీవల వెల్లడించింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని సాక్షి వార్తా సంస్థ 04 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 121 నుంచి 130 సీట్లు గెలుస్తుందని సిపిఎస్ సర్వే ఫలితాలు వెల్లడించినట్టు సాక్షి వార్తా సంస్థ ఈ వీడియోలో రిపోర్ట్ చేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిపిఎస్ సర్వే ఇటీవల ఎటువంటి ఫలితాలని వెల్లడించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇదే న్యూస్ బులెటిన్ వీడియోని సాక్షి వార్తా సంస్థ 04 ఏప్రిల్ 2019 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని సిపిఎస్ సర్వే వెల్లడించినట్టు ఈ వీడియోలో తెలిపారు. సిపిఎస్ సర్వే ఫలితాల ప్రకారం 2019 ఏపి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 121 నుంచి 130 సీట్లు గెలుపొందుతుందని, తెదేపా 45 నుండి 54 సీట్ల వరకు గెలుస్తుందని, జనసేన పార్టీ 1 నుండి 2 సీట్లకే పరిమితమవుతుందని ఈ వీడియోలో తెలిపారు. ఈ విషయాలని రిపోర్ట్ చేస్తూ సాక్షి వార్తా సంస్థ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిపిఎస్ సర్వే వెల్లడించిన ఫలితాలని మరికొన్ని వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. అయితే, 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిపిఎస్ సంస్థ ఇటీవల తమ విశ్లేషణ ఫలితాలను వెల్లడించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, 2024 ఎన్నికల సర్వే ఫలితాలని తెలపట్లేదని స్పష్టమయ్యింది.
చివరగా, 2019 ఏపీ ఎన్నికలకు సంబంధించిన వీడియోని 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సిపిఎస్ సర్వే ఇటీవల వెల్లడించినట్టు షేర్ చేస్తున్నారు.