తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న జుమ్మా పాలి మసీదు, ఒకప్పుడు హిందూ దేవాలయం అని, కానీ, అక్కడి ప్రభుత్వ అండతో ముస్లింలు ఇపుడు దాని మసీదుగా వాడుకుంటున్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వాదనకు మద్దతుగా ఒక ఫోటోనూ కూడా షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న జుమ్మా పాలి మసీదు, ఒకప్పుడు హిందూ దేవాలయం. కానీ, అక్కడి ప్రభుత్వ అండతో ముస్లింలు ఇపుడు దాని మసీదుగా వాడుకుంటున్నారు.
ఫాక్ట్(నిజం): తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని జుమ్మా పాలి మసీదు అతి పురాతనమైన మసీదులలో ఒకటి. ఇది ద్రవిడ శైలిలో ఇస్లామిక్ భావాలతో రాతితో నిర్మించబడినది. ‘ది హిందూ’ కథనంలో, డైరెక్టర్ అఫ్ మ్యూజియమ్స్ ప్రభుత్వ మ్యూజియం చెన్నై ప్రచురించిన ‘ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇన్ తమిళనాడు’ అనే పుస్తకంలో ఈ మసీదు విశేషాలను వివరించారు. ఇది ప్రపంచంలోని పురాతన మసీదులలో ఒకటిగా నమ్ముతారు. ఇది వాస్తవానికి 628-630 CEలో యెమెన్ వ్యాపారులచే నిర్మించబడిందని, మళ్ళీ 18వ శతాబ్దంలో పూర్తిగా పునర్నిర్మించబడిందని పేర్కొన్నారు. ఇది ఒక పురాతన గుడి మీద నిర్మించింది అని చెప్పడానికి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, గూగుల్ శోధనలో 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాత చారిత్రక జుమ్మా పాలి మసీదు గురించి చాలా సమాచారం లభించింది. దక్షిణ భారతదేశంలో చాలా పురాతన మసీదులు ద్రవిడ శైలిలో ఇస్లామిక్ భావాలతో రాతితో నిర్మించబడ్డాయి. డైరెక్టర్ అఫ్ మ్యూజియమ్స్, ప్రభుత్వ మ్యూజియం చెన్నై ద్వారా ప్రచురించబడిన Dr. రాజా మహమ్మద్ రచించిన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇన్ తమిళనాడు అనే పుస్తకంలో ఈ మసీదు విశేషాలను వివరించారు.
ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది ద్రవిడ శైలిలో, చాలా ఉన్నతమైన క్రమంలో మరియు పరిపూర్ణతతో కూడిన ఇస్లామిక్ భవనం. ఈ మసీదు పూర్తిగా ద్రవిడ నిర్మాణం. సాధారణ సందర్శకులు దీనిని ఆలయ మండపంగా గుర్తించే అవకాశం ఉంది అని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ మసీదు నిర్మాణాన్ని సీతక్కతి మరక్కాయర్ ప్రారంభించి, పద్దెనిమిదవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో అతని వారసులు పూర్తి చేశారని నమ్ముతారు. ఈ మసీదు ద్రవిడ శైలిలో ఇస్లామిక్ రూపంలో నిర్మించబడింది. అంతే కాక, ద్రవిడ మరియు ఇస్లామిక్ కళల కలయికగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. పుస్తకంలో ఇచ్చిన మరింత సమాచారం ప్రకారం ప్రార్థనా మందిరం లోపల ఉన్న ఏకైక ఇస్లామిక్ మూలకం వంపు రూపంలో ఉన్న మిహ్రాబ్. మిహ్రాబ్ యొక్క ఎడమ వైపున ఒక మింబర్ ఉంది, కానీ అది చెక్కతో చేయబడింది. మసీదులోని ఏ భాగంలోనూ శిల్పకళా ప్రాతినిధ్యాలు లేవు.
‘ది హిందూ’ , బీబీసీ తమ కథనాలలో ఈ మసీదు విశేషాలను వివరించాయి. ఇంకా అనేక వార్తసంస్థలు ఈ మసీదు గూర్చి కథనాలు ప్రచురించాయి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ మసీదు 17వ శతాబ్దంలో ద్రవిడ వాస్తుశిల్పంతో నిర్మించిన పురాతన ఇస్లామిక్ భవనం. మసీదు యొక్క స్తంభాలలో ఇస్లామిక్ సంస్కృతి ప్రకారం పూల చెక్కడాలు ఉన్నాయి, హిందూ దేవాలయాల వలె శిల్పాలు లేవు.