Fake News, Telugu
 

హిందూ బ్రాహ్మణ అమ్మాయిలను లవ్ జిహాద్‌లోకి దించడం కోసం ముస్లింలు గోల్డెన్ సగాయి షాదీ అనే వివాహ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నారంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

హిందూ బ్రాహ్మణ బాలికలను లవ్ జిహాద్‌లోకి దించడం కోసం ముస్లిం గ్రూపులు ప్రత్యేకంగా గోల్డెన్ షాదీ అండ్ సగాయి (Golden Shadi & Sagai) అనే మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వధువుల వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ ఇస్లామిక్ నెట్వర్క్  ద్వారా ఈ హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్‌లోకి ట్రాప్ చేస్తున్నారని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ బ్రాహ్మణ బాలికలను లవ్ జిహాద్‌లోకి దించడం కోసం ముస్లిం గ్రూపులు ప్రత్యేకంగా గోల్డెన్ షాదీ అండ్ సగాయి అనే మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాయి.

ఫాక్ట్ (నిజం): గోల్డెన్ సగాయి షాదీ (Golden Sagai Shadi) అనేది కేవలం ముస్లింల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గుజరాత్‌కు చెందిన ఒక వివాహ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో హిందూ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని గోల్డెన్ సగాయి షాదీ యజమాని ఇమితీయాజ్ ఖాన్ పఠాన్ మాకు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి వెతికితే, హిందూ బ్రాహ్మణ బాలికలను టార్గెట్ చేస్తూ ముస్లిం గ్రూపులు గోల్డెన్ షాదీ అండ్ సగాయి అనే మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది.

గోల్డెన్ సగాయి షాదీ (Golden Sagai Shadi) అనేది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక మ్యాట్రిమోని వెబ్సైట్ అని తెలిసింది. గోల్డెన్ సగాయి షాదీ ఒక ముస్లిం మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ అని తమ వెబ్‌సైట్‌ వివరణలో స్పష్టంగా పేర్కొన్నారు.  

హిందూ అమ్మాయిలు లేదా అబ్బాయిలు గాని రిజిస్టర్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్లు ఏవి అందుబాటులో లేవు. కుటుంబ వివరాలకు సంబంధించి కేవలం తల్లిదండ్రుల వివరాలు, చిరునామా, వధువు లేదా వరుడు ఏ కులం నుండి కావాలని ఆసక్తి చూపుతున్నారనే ప్రశ్నలు తప్పితే మతపరమైన ప్రశ్నలు ఏవీ రిజిస్ట్రేషన్ జాబితాలో అడగలేదు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన స్పష్టత కోసం మేము గోల్డెన్ సగాయి షాదీ యాజమాని ఇమితీయాజ్ ఖాన్ పఠాన్‌ను సంప్రధించాము. గోల్డెన్ సగాయి షాదీ (Golden Sagai Shadi) అనేది కేవలం ముస్లింల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వివాహ వెబ్‌సైట్ అని, ఈ వెబ్‌సైట్‌లో హిందూ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని రిజిస్టర్ చేసుకోవడానికి లేదని ఇమితీయాజ్ మాకు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి అలహాబాద్ పోలీస్ కమిషనర్ తమ ఆఫీసుపై రైడ్ చేసి ఈ ప్రచారం పూర్తిగా తప్పని తేల్చారని, దీనికి సంబంధించి పబ్లిష్ అయిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ‘గోల్డెన్ సగాయి షాదీ’ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేశామని తెలిపారు. పై వివరల ఆధారంగా పోస్టులో తెలుపుతున్నట్టు హిందూ బాలికలు గోల్డెన్ సగాయి షాదీ వివాహ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, హిందూ బ్రాహ్మణ అమ్మాయిలను లవ్ జిహాద్‌లోకి దించడం కోసం ముస్లింలు గోల్డెన్ సగాయి షాదీ అనే వివాహ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నారంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll